ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఖాకీలు డ్రోన్ కెమెరాలతో డేగ కన్ను పెట్టారు. నేటి నుంచి 08 వ తేదీ వరకు జరిగే PLGA వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్ట్ లు పిలుపు నివ్వడంతో ఏజెన్సీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. PLGA వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు ఏదైన విధ్వంసానికి పాల్పడవచ్చనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఒకవైపు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, మరోవైపు కమాండ్ కంట్రోల్ డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ( PLGA) వారోత్సవాలను మావోయిస్టు పార్టీ ప్రతిఏటా డిసెంబర్ 02 నుంచి 08వ తేదీ వరకు నిర్వహిస్తుంది. ఈ వారోత్సవాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలపునిస్తూనే.. మావోయిస్టులు వారోత్సవాల సందర్భంగా ఏదో ఒక విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తుంటారని చెబుతుంటారు. పోలిస్ ఇన్ ఫార్మర్లను హతం చేయడం, బ్లాస్టింగ్ లకు ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈసారి ముందస్తుగా అప్రమత్తమయ్యారు.
ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై డేగ కన్ను పెట్టారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు డ్రోన్ కెమెరాలతో మావోయిస్టుల కదలికలను పసి గడుతున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం మండలాల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మహముత్తారం, పలిమెల, కాటరం, మల్హర్ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గోదావరి తీర ప్రాంతం, మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో సెర్చ్ చేస్తున్నారు.
ఇప్పటికే మావోయిస్ట్ యాక్షన్ టీమ్ విధ్వంసానికి వ్యూహరచన చేస్తున్నారనే సమాచారంతో పోలీస్ నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. టార్గెట్స్, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లను అప్రమత్తం చేశారు. దీంతో అడవుల్లో అలజడి మొదలైంది.. గుత్తికోయ గూడేలపై కూడా డేగ కన్ను పెట్టారు. మరోవైపు మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి.. వారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..