Revanth Reddy meets Konda Vishweshwar Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి ముఖ్యనేతలందరితో భేటీ అయ్యారు. ఏడేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ కొత్త, పాత , సీనియర్ల నేతల సమన్వయంతో ముందుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అలాగే, పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించేందుకు బుజ్జగింపులు మొదలు పెట్టారు. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు. కొండా నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. తొలుత టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. గత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దీంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలువురు నేతలతో భేటీ అయినప్పటికీ ఆయన ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.