TS MLC Election: తెలంగాణ ఏ క్షణమైనా ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్.. కరోనా నేపథ్యంలో ఎలక్షన్స్ జరిగేనా..?

తెలంగాణ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పడేం ఎన్నికలు అనుకుంటున్నారా?.. ఉన్నాయి.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలోనే జరగాల్సి ఉంది.

TS MLC Election: తెలంగాణ ఏ క్షణమైనా ఎమ్మెల్సీల ఎన్నికల నోటిఫికేషన్.. కరోనా నేపథ్యంలో ఎలక్షన్స్ జరిగేనా..?
Telangana Legislative Council

TS MLC Election 2021: తెలంగాణ మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పడేం ఎన్నికలు అనుకుంటున్నారా?.. ఉన్నాయి.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెలలోనే జరగాల్సి ఉంది. త్వరలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తోంది. ఇందులో ఆరుగురి పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా అదే నెలలో 16 ఆఖరి తేదీ. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే వారమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది.

వచ్చే నెల గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీల్లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిఫ్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకరేశ్వర్లు ఉన్నారు. ఇక, గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి. కాగా, గవర్నర్ కోటాను భర్తీ చేసేంుదకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో ఈ ఖాళీ భర్తీ చేయాల్సి ఉంటుంది.

అయితే, ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నిర్వహించాల్సిన ఉపఎన్నికలను సీఈసీ లేటెస్టుగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభలకు ఎన్నికలను నిర్వహించటం వల్లే దేశంలో కోవిడ్-19 కేసులు ఇంతలా పెరిగాయనే విమర్శను సీఈసీ మూటగట్టుకుంది.

ఇదిలావుంటే, అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే ఈ ఆరు ఎమ్మెల్సీ పదవులనూ ఆ పార్టీయే దక్కుతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాకపోతే వాటిని ఆశిస్తున్నవారి సంఖ్యనే రెండు మూడు రెట్లు ఉంది. ఇది ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నొప్పించక తానొవ్వక అనే రీతిలో అభ్యర్థులను ఎంపిక చేయటం కేసీఆర్ కి కొంచెం ఇబ్బందికరంగా మారొచ్చు. రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా మంది నాయకులకు పార్టీ అధినేత ఈ ఎమ్మెల్సీ పదవులనే ఆశగా చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఛాన్స్ రాకపోతే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల దాకా ఆగాల్సి ఉంటుంది. అవి జరగటానికి ఇంకా రెండేళ్లకు పైగా వేచి చూడాలి. తీరా పార్టీ టికెట్ ఇచ్చినా ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి గెలుస్తామో లేదా అనే భయం ఉంటుంది. దీంతో ఇప్పుడు అవకాశం రాకపోతే వారిలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది.

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఇంతకు ముందులా లేవు. ఒక వైపు వైఎస్ షర్మిల, మరో వైపు ఈటల కేసీఆర్ కి వ్యతిరేకంగా ముఠాలను కడుతున్నారు. పార్టీ కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ మంత్రి బర్తరఫ్ కావడం.. కొత్త కుంపటి పెట్టుకునే యోచనలో ఉండటంతో అధినేత కేసీఆర్ అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం రానోళ్లు అటు వైపు జంప్ చేసినా చేస్తారు. అది తదుపరి శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి మైనస్‌గా అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుచేత, కేసీఆర్ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రస్తుత కరోనా పరిస్థితులను బేరుజు వేసుకుని షెడ్యూల్ విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో అసలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాంలే అన్న ధోరణిలో టీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశంఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావటానికి 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన వచ్చే వారంలోనే నోటిఫికేషన్‌ జారీ కావాలి. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నికలను ఈసీ నిర్వహిస్తుందా? వాయిదా వేస్తుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Read Also….  కరోనా సెకండ్ వేవ్ అలర్ట్..! జ్వరం లేకపోతే కొవిడ్‌ను గుర్తించడం ఎలా..? ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా వైరసే..