ప్రస్తుత కాలంలో ఆకస్మికంగా సంభవిస్తున్న గుండె పోటు సమస్యతో కొన్ని లక్షల మంది చనిపోతున్నారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అంతేకాక ప్రతి రోజూ సగటున 4వేల మంది చనిపోతున్నారన్నారని తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్లాలోని జీవీకే, ఈఎంఆర్ఐ కేంద్రంలో సీపీఆర్ శిక్షణను ప్రారంభించిన ఆయన సీపీఆర్ గురించి పలు విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్డియాక్ అరెస్టు ఎవరికైనా వచ్చే అవకాశం ఉందని.. దానికి సమయం, సందర్భం లేదన్నారు. ఇలా చనిపోతున్న వారిని సీపీఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించవచ్చన్నారు. అందుకే ప్రజలు ఇతరుల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే సీపీఆర్ శిక్షణ తీసుకొచ్చామని చెప్పారు. సీపీఆర్ ప్రక్రియను విజయవంతం చేస్తే ప్రతి 10 మందిలో 9 మందిని బతికించవచ్చని డబ్ల్యూహెచ్‌వోతో పాటు పలు ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణలో సడెన్ కార్డియాక్ అరెస్టు వల్ల ఏడాదికి 24 వేల మంది చనిపోతున్నారని తెలిపారు. లక్షలాది ప్రాణాలు కాపాడే ఒక మంచి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని హరీశ్ రావు పేర్కొన్నారు. రూ.18 కోట్లతో 1,200 ఏఈడీ పరికరాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నామన్నారు. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచుతామన్నారు. సీపీఆర్ శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యారోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వారికి కూడా శిక్షణ ఇస్తామన్నారు.
అనంతరం ఇటీవల సీపీఆర్ చేసి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్, డీఎంహెచ్‌వో వెంకటరమణలను మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ సన్మానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హరీష్ రావు వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైద్య రంగం ముందుకు సాగుతోందని ఆయనను కొనియాడారు. వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని.. కంటి వెలుగు, టీ డయాడ్నస్టిక్స్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా పెంచామన్నారు. విదేశాల్లో మాస్టర్ చెకప్ చేయించుకుంటే, మన దగ్గర ఆ పరిస్థితి ఉందన్నారు. లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులు వచ్చాయని.. ఈ మధ్య సడన్ కార్డియక్ అరెస్ట్ సంఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ యువకుడు పెళ్లిలో నృత్యం చేస్తూ చనిపోతే, మరో వ్యక్తి జిమ్‌లో కసరత్తు చేస్తూ మృతి చెందాడని గుర్తు చేసుకున్నారు కేటీఆర్. తమ మామ కూడా ఇటీవల హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని.. గుండెపోటు వచ్చిన సమయంలో ఏం చేయాలో తెలియక చనిపోతున్నారని పేర్కొన్నారు. హరీష్ రావుకు ఏం చెప్పినా వెంటనే రాసుకునే అలవాటు ఉందన్నారు. జన సంచారం ఉండే ప్రాంతాల్లో డీ ఫైభ్యులేటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో మాల్స్, ఇతర ప్రాంతాల్లో డి ఫైభ్యులేటర్ కచ్చితంగా పెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఒక లక్ష మందికి ట్రైనింగ్ ఇవ్వాలని.. ఐదుగురిని కాపాడినా, ఐదు కుటుంబాలను కాపాడిన వారు అవుతామని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..