హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 లిక్కర్ షాపులకు లక్కీ డ్రా సోమవారం (ఆగస్టు 21) విజయవంతంగా ముగిసింది. పూర్తి పారదర్శకతతో ఎలాంటి సిండికేట్లకు తావులేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ షాపులకు లైసెన్స్ కేటాయించామని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం తావులేకుండా ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా అందరికీ తెలిసేలా లాటరీ నిర్వహించినట్టు ఆయన చెప్పారు. దాదాపు లిక్కర్ షాపుల నిర్వహణకు 1,31,970 దరఖాస్తులురాగా 2,598 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో సోమవారం ఎంపిక చేశారు. ఇక 22 మద్యం షాపులకు దరఖాస్తులు తక్కువ రావడంతో వాటిని పక్కన పెట్టారు. లాటరీలో షాపులు పొందిన వారికి మంత్రి అప్పటికప్పుడు ఉత్తర్వులు అందజేశారు. కాగా మద్యం షాపులను పొందిన వారికి రెండేళ్లపాటు లైసెన్స్ మంజూరు చేయబడుతుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సిండికేట్లుగా ఏర్పడి మద్యం దుకాణాలను నిర్వహించే వారు. దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును కొల్లగొట్టేవారు. మాఫియా ఎక్సైజ్ సుంకం కూడా వచ్చేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్, పోలీసులు సమర్థవంతంగా పనిచేయడంతో నకిలీ మద్యాన్ని అరికట్టగలిగాం. కల్తీకి తావులేకుండా రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరా అందించాలనే ఉద్దేశంతో నీరా పాలసీని తీసుకొచ్చాం. ఇందుకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల ముప్పై లక్షల తాటి, ఈత చెట్లను పెంచుతున్నామని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.