Hyderabad Agri Hub: యువత, మహిళలు, రైతులకు అగ్రిబిజినెస్ మెళకువలు.. తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన అగ్రి హబ్
తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాయ గుర్తింపు తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తోందని మంత్రి కేటీ రామారావు తెలిపారు.
Hyderabad Agri Hub: తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తోందని మంత్రి కేటీ రామారావు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలు, రైతులు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు అగ్రి హబ్ గ్రంథాలయంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్ అగ్రిహబ్‌ను మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ఇప్పటికే రాష్ట్రంలో T హబ్, V హబ్ లు అందుబాటులో ఉన్నాయి. లెటెస్ట్‌గా అగ్రి హబ్ వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలవనుంది. ఇన్నోవేటివ్ హబ్‌ను ప్రారంభించిన అనంతరం ఎగ్జిబిషన్, ఉత్పత్తులను మంత్రులు పరిశీలించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్ కంపెనీలు కొలువుదీరనున్నాయి.
వ్యవసాయరంగంలో ఇన్నొవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రిహబ్‌ను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనున్న హబ్ సేవలను గ్రామీణ ప్రాంతాల రైతులకు చేరువచేసేందుకు జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లో ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అగ్రిహబ్‌ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రోబోటిక్ విధానంలో కలుపు తీయడం, డ్రోన్‌ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. గ్రామీణయువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. నాణ్యతగల విత్తనాలు, మొక్కలకు కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పంట దిగుబడి తదితర వివరాలు అందుబాటులో ఉంటాయి.