Minister KTR Criticise on Union Budget 2022: కేంద్ర ప్రభుత్వం(Union Government) తెలంగాణ(Telangana)పై వివక్షత చూపుతోందని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు(Minister KTR) అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్.. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీలేదన్నారు. తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారని, ప్రగతి శీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పేదలకు ఉపయోగ పడే ఒక్క అంశం కూడా బడ్జెట్ లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరామని, మెట్రో రైలు కు నిధులు అడిగామని ఆయన వెల్లడించారు. అలాగే మిషన్ భగీరథకు ఫండ్స్ అడిగామని, ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి చేయూతను ఇవ్వాలని ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరిన ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అంశాల విషయంలో తగినంత నిధులు ఇవ్వడంలో కేంద్రం మరోసారి మొండి చేయి చూపిందన్నారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం ఇకనైనా ఈ సవతి తల్లి ప్రేమను విడనాడాలని రాష్ట్రం అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా కేంద్రం సహాయం చేయాలన్నారు. అయితే కేంద్రం బడ్జెట్ లో మా రాష్ట్రానికి తగిన నిధులను ఇవ్వకపోయినా మా ప్రభుత్వం అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో తగ్గేది లేదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.