
తెలంగాణలో నాలుగైదు రోజుల నుంచి పవర్ పాలిటిక్స్ షాక్ కొడుతున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. అమెరికా పర్యటించిన రేవంత్‌రెడ్డి.. ఉచిత విద్యుత్‌పై ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ టార్గెట్‌గా అధికార బీఆర్ఎస్ ఓ రేంజ్‌లో ఎటాక్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు.. తెలుగుదేశం కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. నాడు వ్యవసాయం దండ అంటే.. ఇప్పుడున్న టీ.కాంగ్రెస్ చీఫ్ ఆయన శిష్యుడు కాబట్టి.. రైతులకు మూడు గంటల కరెంట్ చాలంటున్నారని మండిపడ్డారు కేటీఆర్.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు మంత్రి హరీశ్‌రావు. మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. చంద్రబాబుకు నిజమైన వారసుడు అనిపించుకున్నారని విమర్శించారు హరీశ్‌రావు. మరోవైపు.. కరెంట్ సబ్ స్టేషన్లలోని లాగ్ బుక్స్‌తో చర్చకు సిద్ధమా అన్న రేవంత్‌రెడ్డి సవాల్‌కు ప్రతిసవాల్ విసిరారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి కొత్త బాసులు, పాత బాసుల హయాంలోని అన్ని కరెంట్ ఫైల్స్ బయటకు తీయడానికి రెడీగా ఉన్నామన్నారు.
మొత్తంగా.. తెలంగాణలో కరెంట్ రాజకీయం కాకరేపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో కరెంట్ మంటలు హైవోల్టేజ్‌ను తలపిస్తున్నాయి. మరో మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరెంటే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..