
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళి సై మధ్య వైరం మళ్లీ ముదురుతోంది. తాజాగా సీఎస్‌పై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు.. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు ఇప్పటికీ ఆమోద ముద్ర వేయకపోవడం ప్రభుత్వ పెద్దలకు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమిళి సై వ్యవహారశైలిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో గవర్నర్‌కు బానిసలు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఫైళ్ళ క్లియరెన్స్ కోసం గవర్నర్ వద్ద పైరవీలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులు ఆమోదింపజేసేలా ఆదేశించాలంటూ రిట్ పిటిషన్ వేసింది సర్కార్. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం, సీఎం తీరుపై విమర్శలు గుప్పించారు. బిల్లులు ఆమోదంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీకోర్టుకు వెళ్లడంపై.. పరోక్షంగా విమర్శలు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉందంటూ గవర్నర్ తమిళిసై గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కామెంట్స్ నేపథ్యంలోనే స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి పై విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి.. బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ధరల పెంపుపై జాతీయ స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగడతామన్నారు.
ఇక నల్లగొండలో బీఆర్ఎస్ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ లో జరిగిన నిరసన ధర్నాలు బీఆర్ఎస్ నేతలు మహిళలు భారీగా పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్లతో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. పేదల నుంచి వసూలు చేస్తున్న సొమ్మునంతా అంబానీ ఆదానీలకు.. ప్రధాని మోదీ దోచి పెడుతున్నారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు. పేదల నడ్డి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ధరణి పెంచుతుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..