Allam Narayana: కరోనాతో మరణించిన జర్నలిస్టులకు 2 లక్షలు.. ఐదేళ్లపాటు నెలకు రూ.3 వేలు పింఛన్.. ఈ నెల 15న చెక్కుల పంపిణీ
Allam Narayana: కరోనా కల్లోలం సమయంలో విధులను నిర్వహిస్తూ.. కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల ఫ్యామిలీలకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అండగా నిలబడింది. కరోనాతో మరణించిన..
Allam Narayana: కరోనా కల్లోలం సమయంలో విధులను నిర్వహిస్తూ.. కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల ఫ్యామిలీలకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అండగా నిలబడింది. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమి తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈ నెల 15వ తేదీ బుధవారం రోజు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు అల్లం నారాయణ కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది మార్చి నుండి డిసెంబర్, 6వ తేదీ వరకు 7 నెలల కాలంలో ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ భవనంలోని 2వ అంతస్తులోని మీడియా అకాడమి కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేయనున్నట్లు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలియజేశారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ లో మరణించిన జర్నలిస్టుల కుటుంబాల నుంచి ఇప్పటి వరకు 63 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించి ఆయా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తున్నాము. అదే విధంగా మార్చిలో ఆర్థిక సహాయం అందించిన వారిలో కరోనా మహమ్మారితో మరణించిన మూడు జర్నలిస్టుల కుటుంబాలకు అదనంగా మరో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అదే రోజు అందించడం జరుగుతుందన్నారు.
అనారోగ్యం బారిన పడి పని చేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు రూ 50 వేల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం 101 మంది లబ్దిచేకూరుస్తూ ఒక కోటి 62 లక్షల రూపాయల పంపిణీ జరుగుతుందని అల్లం నారాయణ తెలిపారు. అంతేకాదు ఈ కుటుంబాలకు అయిదేళ్లపాటు రూ.3వేల చొప్పున పెన్షన్ కూడా అందిస్తామని ఆయన తెలిపారు.
కరోనా విపత్కర సమయంలో వారియర్స్ గా పని చేసిన వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులతోపాటు జర్నలిస్టులు కూడా వార్తా సేకరణలో గడ్డు పరిస్థితిలలో పని చేశారు. అందువల్లనే జర్నలిస్టులు కూడా విరివిగా కరోనా బారిన పడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తరుఫున కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆడుకుంది.
ఇప్పటి వరకు మొత్తం 3909 మందిలో తొలి విడతగా 1553 మందికి 20 వేల చొప్పున, హోంక్వారంటైన్ లో ఉన్న 87 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. రెండవ విడతలో 2269 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. జర్నలిస్టులకు కరోనా సాయంగా మొత్తం 5 కోట్ల 56 లక్షల రూపాయలు మీడియా అకాడమి నుండి జర్నలిస్టుల ఖాతాలకు పంపిణీ చేసి ఆర్థిక సహాయం ద్వారా ఆదుకుందన్నారు.
అదే సమయంలో కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు వైద్య ఖర్చులు, ఇతర ఇబ్బందులు ఎక్కువైనందువలన వారి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తరుఫున ప్రకటించామని అల్లం నారాయణ తెలిపారు.
Also Read: క్యాన్సర్ కణాలు పెరగకుండా చేసే తులసి విత్తనాలు.. ఈ గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..