బెడ్‌రూమ్‌లో కుప్పలుగా పాములు.. ఆడుకునే బొమ్మని కదిలించడమే ఆలస్యం ఒక్కసారిగా..
అల్లంత దూరంలో పాము కనిపిస్తేనే హడలిపోతాం. అలాంటిది మన పడక గదిలోనే పాము ఉంటే?.. ఒకటి కాదు..
అల్లంత దూరంలో పాము కనిపిస్తేనే హడలిపోతాం. అలాంటిది మన పడక గదిలోనే పాము ఉంటే?.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కుప్పలుగా పాములు ఉంటే?.. అమ్మో ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోయేంత పని అవుతుంది. ఇలాంటి భయానక ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. మెదక్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న సురేందర్ ఇంట్లో బెడ్ రూమ్‌లో పాముల కుప్ప బయటపడింది. బెడ్ రూమ్‌లో పిల్లలు ఆడుకునే బొమ్మ ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఇళ్లు క్లీన్ చేస్తుండగా గదిలో ఉన్న బొమ్మను కదిలించారు. అంతే ఇక.. ఆ బొమ్మలోంచి ముందుగా ఒక పాము పిల్ల బయటకు వచ్చింది. ఆ వెంటనే మరొకటి వచ్చింది. అలా ఒక్కొక్కొటిగా మొత్తం 14 పాములు ఆ బొమ్మ నుంచి బయటకు వచ్చాయి. అది చూసి ఆ ఇంటి సభ్యులు హడలిపోయారు.
తీవ్ర భయాందోళనకు గురై చుట్టుపక్కన వారిని పిలిచారు. వారి సహాయంతో ఆ పాములన్నింటినీ కర్రతొ కొట్టి చంపేశారు. అయితే, నట్టింట్లో ఇలా పాముల కుప్ప బయటకు రావడంతో ఆ కుటుంబీకులు తీవ్రంగా భయపడుతున్నారు. అసలు అన్ని పాములు ఇంట్లోకి ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నారు. అయితే, వారి ఇంటికి పక్కనే పెద్ద మురుగు కాల్వ ఉండటంతో అక్కడి నుంచి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు సమాచారం అందించినా రెస్పాండ్స్ లేదని సురేందర్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే.. సురేందర్ ఇంట్లో బయటపడ్డ పాములను చూసి.. చుట్టు పక్కన వాళ్లు కూడా భయపడిపోతున్నారు. తమ ఇళ్లలో కూడా పాములు ఉన్నాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Telangana High Court: సీబీఐ విచారణ అవసరం లేదు.. న్యాయవాద దంపతుల హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు..