అనాగరిక ఘటన.. ఆ కుటంబాన్ని వెలివేశారు.. ఎవరైనా మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు, 10 వేలు జరిమానా
ఇదో అనాగరిక సంఘటన. ఓ వ్యక్తి తన సొంత బోరు మోటర్ నుంచి గత కొంత కాలంగా గ్రామస్తులకు నీటిని అందించాడు. ప్రస్తుతం నీటిని ఇచ్చేందుకు నిరాకరించడంతో...
ఇదో అనాగరిక సంఘటన. ఓ వ్యక్తి తన సొంత బోరు మోటర్ నుంచి గత కొంత కాలంగా గ్రామస్తులకు నీటిని అందించాడు. ప్రస్తుతం నీటిని ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ వ్యక్తి కుటుంబాన్ని గ్రామస్తులతో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బహిష్కరించారు. ఆ వ్యక్తితో మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు, 10 వేలు జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో జరిగింది.
స్థానికంగా నివసిస్తున్న మాజీ కారోబార్ సురేందర్ రావు… తన స్థలంలో బోరు వేయించి దాని ద్వారా గ్రామస్తులకు నీటిని అందించాడు. ప్రస్తుతం తమ అవసరాలకే సరిపోవడం లేదని.. నీటిని ఇచ్చేందుకు నిరాకరించి కోర్టును ఆశ్రయించాడు. దీంతో గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సురేందర్ రావు కుటుంబాన్ని బహిష్కరించారు. ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడవద్దు వారి ఇంటికి ఎవరు వెళ్ళకూడదు అని తీర్మానం చేశారు. అంతటితో ఆగలేదు.. సురేందర్ రావు కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడినా.. 25 చెప్పుదెబ్బలు, 10 వేల జరిమానా విధిస్తామని ఊరంతా చాటింపు వేయించారు.
దీంతో సురేందర్ రావు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుటుంబాన్ని ఇలా గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బహిష్కరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కాగా జనరేషన్స్ మారుతున్నా ఇటువంటి సంఘటనలు ఇంకా కొనసాగడం గర్హనీయం. ఆకాశంలో అద్బుతాలు చేస్తున్నాం.. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులను మార్చలేకపోతున్నాం. మూలాల నుంచి వీటిని పెకిలించివేయాల్సిన ఆవశ్యకతం ఉంది.
Also Read: బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది
Crime News: భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?