కోరుట్ల, డిసెంబర్ 24: ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద నిర్ణయాలకు కారణం అవుతుంటాయి. ఇలాంటివి వివాహం విషయంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఆడపెళ్లి వారు మర్యాదలు సరిగ్గా చేయలేదనో.. భోజనాల్లో చికెన్ ముక్క వేయలేదనో నానాయాగీ చేసి పెళ్లిళ్లు రద్దు చేసుకున్న ఘటనలు ఈ మధ్య కాలంలో వార్తల్లో చాలానే వచ్చాయి. బలగం సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ గుర్తుందా? అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ చిరిగి.. చిరిగి.. గాలివానగా మారింది. చిరవకు పెళ్లి సంబంధం రద్దయింది. జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. కట్నకానుకలు వంటి మొత్తం తతంగం మాట్లాడుకున్నారు. వివాహ నిశ్చితార్ధం సందర్భంగా నవంబరు మొదటి వారంలో ఆడపెళ్లి వారి ఇంట భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల్లో మాంసాహారం వడ్డించారు. ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దదై చివరికి పోలీస్‌స్టేషన్ వరకు వీరి పంచాయితీ వెళ్లింది. పోలీసులు ఇరువర్గాలు శాంతించినప్పటికీ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.