Telangana Crime: ప్రేమించలేదన్న కోపంతో.. యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి..

|

Sep 20, 2023 | 9:08 AM

అతడికి అప్పటికే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ మరో యువతి వెంటబడి ప్రేమించమని నిత్యం వేధించసాగాడు. సదరు యువతి అతని ప్రేమను నిరాకరించిందన్న కోపంతో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టి, పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కానీ అనూహ్యంగా పదేళ్ల చిన్నారి సాక్ష్యం చెప్పడంతో ఈ అమానవీయ సంఘటన వెలుగులోకొచ్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం..

Telangana Crime: ప్రేమించలేదన్న కోపంతో.. యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి..
Man Killed Young Woman
Follow us on

సిర్పూర్‌, సెప్టెంబర్ 20: అతడికి అప్పటికే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ మరో యువతి వెంటబడి ప్రేమించమని నిత్యం వేధించసాగాడు. సదరు యువతి అతని ప్రేమను నిరాకరించిందన్న కోపంతో నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టి, పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కానీ అనూహ్యంగా పదేళ్ల చిన్నారి సాక్ష్యం చెప్పడంతో ఈ అమానవీయ సంఘటన వెలుగులోకొచ్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

కుమురంభీం జిల్లా సిర్పూర్‌(టి) మండలం వెంకట్రావ్‌పేటకు చెందిన బుదే విట్టు, జీవనకళ దంపతుల కుమార్తె బూడే దీప (19). దీప ఇంటర్‌ అనంతరం చదువు మానేసి గ్రామంలోని కూలీ పనులకు వెళ్తోంది. అదే గ్రామానికి చెందిన దంద్రె జోగాజీ, దుమన్‌బాయిల కుమారుడు దంద్రే కమలాకర్‌ ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి అప్పటికే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలలుగా దీపను ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అయితే ఆమె అతనిని నిరాకరించసాగింది. దీంతో ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని, తల్లిదండ్రులను చంపుతానని బెదిరిస్తూ ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టేవాడు.

ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన (ఆదివారం) దీప కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లగా… సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కమలాకర్‌ యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులను భయపెట్టి బయటికి పంపించాడు. తనను ప్రేమించాలని, వేరే వాళ్లతో మాట్లాడితే సహించేది లేదని లేదంటే తన కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరించాడు. అయినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం అక్కడున్న పురుగు మందును బలవంతంగా ఆమెకు తాగించి పరారయ్యాడు. బాధితురాలు బయటకు వచ్చి కాపాడాలంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు సిర్పూర్‌(టి) ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్‌కు, అక్కడి నుంచి మంచిర్యాలకు ఆ తర్వాత కరీంనగర్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది. తొలుత దీపది ఆత్మహత్యగా భావించిన కుటుంబ సభ్యులు పోస్టుమార్టం కోసం సిర్పూర్‌(టి) సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. కమలాకర్‌ బలవంతంగా దీపకు పురుగుల మందు తాగించిన విషయం పదేళ్ల చిన్నారి చెప్పడంతో మంగళవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆస్పత్రి వద్దనే చిన్నారిని విచారించి పూర్తి వివరాలు సేకరించారు. గ్రామంలోని స్థానికులు నిందితుడిపై దాడికి యత్నించగా కౌటాల సీఐ సాదిక్‌పాషా, ఎస్సై రమేశ్‌ వారికి నచ్చజెప్పారు. మృతురాలి సోదరుడు బుదే రాజేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.