వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..

కాలం వేగంగా మారుతుంది. మనుషుల్లోనూ మానవత్వం తడారిపోతుంది. తల్లికి బిడ్డ బరువవుతుంది. పిల్లలకు కన్నోళ్లు కానివారవుతున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్లు మానబంధాలన్నీ తలకిందులవుతున్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్‌ ఘటన ఒకటి తెలంగాణలోని హనుమకొండలో చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో పిల్లల అండ కోసం ఎదురు చూసిన తండ్రికి నిరాశ ఎదురైంది. దీంతో అతడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు..

వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..
Father Donated His Property To Village Panchayat

Updated on: Jan 23, 2026 | 2:38 PM

హనుమకొండ, జనవరి 23: పిల్లల్ని కని, పెంచి, వారిని ప్రయోజకులను చేస్తే.. వయోప్రాయంలో కన్నోళ్లకు పట్టెడన్నం పెట్టడానికి ఆ కొడుకులకు మనసు రాలేదు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన తండ్రి తన యావదాస్తిని ఊరి పంచాయితీకి రాసిచ్చి.. మీసం మెలేశాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

జిల్లాలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేట గ్రామంకి చెందిన పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లుకి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌కు చెందిన వెంకటేశ్వర్లు 50 ఏళ్ల క్రితం పెంచికల్ పేటలోని దేవాలయానికి పూజారిగా వచ్చారు. ఆ సమయంలో అతని జీవనోపాధి కోసం గ్రామ పెద్దలు 4.38 ఎకరాల భూమిని సాగుకోసం కేటాయించారు. దీంతో అప్పటినుంచి వెంకటేశ్వర్లు పౌరోహిత్యం చేసుకుంటూ.. ఆ భూమిలో పంటలు పండిస్తూ కుటంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారులు, కుమార్తెకు వివాహం జరిపించాడు.

అయితే ఇటీవల వెంటకేశ్వర్లు భార్య మరణించింది. ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో వెంకవేశ్వర్లు బాగోగులు చూసుకునే వారు కరువయ్యారు. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన తనను పోషించేవారులేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గ్రామ ఆలయంలో మరో పూజారిని నియమించారు. దీంతో వెంకటేశ్వర్లు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కొడుకులు తనను పోషించడం లేదని భావించిన ఆయన గతంలో గ్రామస్తులు తనకు కేటాయించిన భూమిని తిరిగి గ్రామ పంచాయితీకే ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఈక్రమంలో గురువారం గ్రామసభ ఏర్పాటు చేసి, తన అసైన్డ్‌ భూమిని తిరిగి గ్రామపంచాయతీకే ఇస్తున్నట్లు కాగితాలపై సంతకం చేశాడు. వెంకటేశ్వర్లు నిర్ణయంతో అటు కొడుకులు, ఇటు గ్రామస్థులు అంతా ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.