TS Junior Doctors Strike: ప్రస్తుతం తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలా ఓ వైపు కరోనా విపత్కర పరిస్థితులు కబళిస్తుంటే మరోవైపు జూనియర్ డాక్టర్ తాజాగా ప్రభుత్వానికి చేసిన డిమాండ్ ఆందోళన కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని పలుసార్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలను పెంచాలని తాజాగా సోమవారం జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. జీతంతో పాటు 10 శాతం ఇన్సెంటివ్‌ను వెంటనే చెల్లించాలని జూడాలు డిమాండ్ చేశారు. ఇందుకు గాను ప్రభుత్వానికి రెండు వారాలు గడువు ఇచ్చారు. అంతలోపు సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. ఇక జూడాలు ఈ డిమాండ్లతో పాటు కోవిడ్ డ్యూటీలు చేసే హెల్తే కేర్ వర్కర్స్ కరోనా బారిన పడితే.. నిమ్స్‌లో వైద్యం అందించేలా వెంటనే జీఓను విడుదల చేయాలని కోరారు. ఇక కరోనా కారణంగా మృతి చెందిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరి జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.