Telangana News:నకిలీ ఓట్ల నివారణకు ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు మాత్రం ఏదో రకంగా నకిలీ ఓట్లను పొందుతున్నారు. అసలైన వ్యక్తులకు తెలియకుండానే.. వారి పేరిట నకిలీ ఓటర్ ఐడీలు పొందుతున్నారు. తాజాగా తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నకిలీ ఓట్లను సృష్టించే ప్రయత్నంలో అగంతకులు.. దరఖాస్తులో వ్యక్తుల ఫోటోలకు బదులుగా వినాయకుడు ఫోటోను ఎంట్రీ చేశారు. అంతేకాదు.. పేరు ఒకటి, ఊరు ఒకటి, ఫోన్ నెంబర్ మరొకటి.. ఇలా చిత్రవిచిత్రమైన చిరునామాతో ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా ఓటర్‌గా నమోదు చేశారు.
అయితే, ఓటర్ ఐడీ లిస్ట్‌లో గణేషుడి చిత్రపటాన్ని గమనించిన ఎన్నికల సంఘం అధికారులు.. ఈ ఫోటోలోని గణేషుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలంటూ దేవాదాశాఖ అధికారులకు సించారు. దాంతో అసలేం జరిగిందని ఆరా తీయగా.. ఇది మునుగోడు నియోజక వర్గం, ఘట్టుప్పల్ మండలంలో చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. అలాగే రెవెన్యూ అధికారులు దరఖాస్తుదారుడి చిరునామాను పరిశీలించగా.. దరఖాస్తు నకిలీదని గుర్తించారు అధికారులు. వీరి సూచనల మేరకు మండల తహశీల్దార్ ఈ ఓటర్ ఐడీ దరఖాస్తును తిరస్కరించారు.
కాగా, త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉరుగనున్న నేపథ్యంలో ఓటర్ నమోదు ప్రక్రియను ప్రాంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందుకోసం ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు. అయితే, దీనిని ఆసారాగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు.. వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి భార్య మొబైల్ నెంబర్‌తో పాటు గణేషుడి ఫోటోను అప్‌లోడ్ చేశాడు. ఫారం 6 నింపి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కైలాశం అనే వ్యక్తి చిరానామాను పేర్కొన్నట్లు తెలిపారు.
అయితే, సదరు వ్యక్తులు ఓటర్ ఐడీ కోసం మహిళ నెంబర్‌ను నమోదు చేయడంతో.. అధికారులు అనుమానం వచ్చి ఆ నెంబర్‌కు కాల్ చేశారు. వివరాలను ఆరా తీశారు. దాంతో అసలేం జరిగిందో అర్థం కాక సదరు మహిళ భయాందోళనకు గురయ్యింది. రెవెన్యూ అధికారులతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కూడా తనకు పలుమార్లు కాల్స్ వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఎవరో ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేసే సమయంలో నా మొబైల్ నెంబర్‌ను ఉపయోగించారు. దాంతో నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా మొబైల్ నెంబర్‌ను వారి ఆధార్ కార్డులకు కూడా యాడ్ చేసినట్లు సమాచారం అందింది. ఎలాంటి నష్టం జరుగకముందే.. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలి.’ అంటూ సదరు మహిళ అధికారులను రిక్వెస్ట్ చేసింది.
కాగా, ఎన్నికల సంఘం పోర్టల్లో పేర్కొన్న ఫేక్ సమాచారాన్ని తొలగించి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు సమాచారం అందించామని నల్లగొండ రెవెన్యూ అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..