
HYDRAA: ఆక్రమణలపై కఠిన చర్యలు చేపడుతున్న హైడ్రా గత రెండేళ్లలో భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రజా అవసరాలకు సంబంధించిన భూములను కాపాడింది. కబ్జాదారుల చెర నుంచి విముక్తి కల్పించిన భూముల విలువ సుమారు రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. మరో ఏడాదిలో అదనంగా రూ.లక్ష కోట్ల విలువైన భూములను రక్షించడమే లక్ష్యంగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత మొత్తం 2,435.23 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. వీటిలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు, రహదారులు, ప్రజావసరాలకు కేటాయించిన భూములు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఈ భూముల విలువ భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చెరువుల ఆక్రమణలను తొలగించడంలో హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు 449.11 ఎకరాల మేర చెరువు భూములను కాపాడింది. మొదటి విడతలో చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా తమ్మిడికుంట, కూకట్‌పల్లి నల్లచెరువు, ఉప్పల్ నల్లచెరువు, సున్నం చెరువు, బమృకున్ ఉద్ దౌలా చెరువు, బతుకమ్మకుంట ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించి చెరువుల విస్తీర్ణాన్ని పెంచింది.
మొదటి విడతలో చేపట్టిన చెరువుల పరిసరాల్లో దాదాపు 70 ఎకరాల భూమిని రక్షించిన హైడ్రా, ప్రస్తుతం రెండో విడతలో ఎంపిక చేసిన 14 చెరువుల వద్ద మరో 300 ఎకరాల భూమిని కాపాడే పనిలో ఉంది. చెరువుల పునరుద్ధరణ ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత ప్రజావాణి ఫిర్యాదులు, రెవెన్యూ శాఖ అందించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని 1,804.23 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. కుత్బుల్లాపూర్, అమీన్‌పూర్, ఖానామెట్, కొండాపూర్, ఘట్‌కేసర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములను ఆక్రమణల నుంచి విముక్తి చేసింది.
అదే సమయంలో నాలాల ఆక్రమణలను తొలగించి 19.26 ఎకరాలు, పార్కుల భూముల్లో 90.29 ఎకరాలు, రహదారులు, ఫుట్‌పాత్‌లకు సంబంధించిన 50.06 ఎకరాలు, ప్రజావసరాల కోసం కేటాయించిన 21.29 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకుంది.
ఆక్రమణల వెనుక రాజకీయ, ఆర్థిక పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ హైడ్రా వెనుకడుగు వేయలేదని అధికారులు చెబుతున్నారు. భారీ ఒత్తిళ్లు, సవాళ్ల మధ్య కూడా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు కొనసాగించినట్లు పేర్కొంటున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకారం, 2024 జూలైలో ఏర్పాటైన సంస్థ మరో నెల రోజుల్లో రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే సాధించిన ఫలితాలకు కొనసాగింపుగా వచ్చే ఏడాదిలో మరో రూ.లక్ష కోట్ల విలువైన భూములను రక్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
చెరువుల పునరుద్ధరణతో పాటు మరో నాలుగు పెద్ద చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాకాలంలో కాలనీలు, రహదారులు నీట మునగకుండా హైడ్రా డీఆర్‌ఎఫ్, మెట్ బృందాలు క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టనున్నాయి. గత ఏడాది 150 డివిజన్ల పరిధిలో పనిచేసిన హైడ్రా, ఈసారి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బాధ్యతలు స్వీకరించి తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి