
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి పెరిగింది. తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు బుజ్జగింపుల పని మొదలెట్టారు. 3న పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా తెలాల్సిఉంది. మరోవైపు ఎన్నికల అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించే ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నిక కోసం గుర్తులు ఎలా కేటాయిస్తారు? గుర్తుల కేటాయింపు ప్రాసెస్ ఎలా ఉంటుంది?
మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తిచేసుకుని బరిలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించనున్నారు. మరోవైపు రెండో విడత నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులను బుజ్జగించే ప్రక్రియలో మిగతా అభ్యర్థులు ఉన్నారు. దీంతో తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. పార్టీ రహితంగా నిర్వహించబడే ఈ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కీలక ఘట్టాన్ని పూర్తి చేయనుంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. మొదటి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు డిసెంబరు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ గడువు ముగిసిన వెంటనే.. పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. తెలుగు అక్షర క్రమం ఆధారంగా పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు ఉండనుంది. పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ వేసిన డాక్యుమెంట్‌లో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తుల కేటాయింపు జరుగుతుంది.
అభ్యర్థుల పేరులోని మొదటి అక్షరం ఆధారంగా పోటీదారులకు గుర్తులు కేటాయింపు జరుగుతుంది. కొందరు అభ్యర్థులు తమ ఇంటిపేరును ముందుగా, మరికొందరు తమ పేరును ముందుగా పేర్కొంటారు. పేరుకు ముందు భాగంలో ఉన్న అక్షరం ఆధారంగానే ఈ క్రమాన్ని నిర్ణయిస్తారు. ఇది అభ్యర్థులు తమ బ్యాలెట్ స్థానాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించే ఒక వ్యూహం కూడా. సర్పంచి ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం 30 ప్రత్యేక గుర్తులను కేటాయించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే తమ నిరసనను తెలియజేసేందుకు నోటా గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రాధాన్యత క్రమంలో మొదట ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్టు, స్పానర్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్‌హ్యాండిల్, టీ జల్లెడ, మంచం, టేబుల్, బ్యాటరీ లైట్, బిస్కెట్, వేణువు, చెప్పులు, గాలి బుడగ, క్రికెట్ స్టంప్స్ వంటి నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులకు సంబంధించిన గుర్తులు కేటాయించారు. సర్పంచి అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను గులాబీ రంగు బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు.
వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 20 గుర్తులను కేటాయించింది. నోటాతో కలిపి మొత్తం 21 గుర్తులు ఉంటాయి. గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్ ఆంటినా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ కర్ర బంతి, నెక్‌టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్తు స్తంభం, కెటిల్, నోటా వంటి సాధారణ గుర్తులను కేటాయించారు. వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన గుర్తులను తెల్ల రంగు బ్యాలెట్ పేపర్‌పై ముద్రిస్తారు.
గుర్తుల కేటాయింపు పూర్తి అయిన వెంటనే.. ఆయా గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియకు అవసరమైన బ్యాలెట్ పేపర్లను ముద్రించి పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్, పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన చర్యలను అధికారులు వేగవంతం చేస్తున్నారు. తొలి విడత ఎన్నికలకు ఈనెల 11న పోలింగ్, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..