టెయిల్‌పాండ్‌ వ్యవహారంలో తెరపైకి కృష్ణా జలాల అంశం.. KRMBకి తెలంగాణ సర్కార్ లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా టెయిల్‌పాండ్‌ కేంద్రంగా ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం తెరపైకి వచ్చింది. టెయిల్‌ పాండ్‌ నుంచి ఏపీ సర్కార్ అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని KRMBకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం చర్చనీయాంశమైంది.

టెయిల్‌పాండ్‌ వ్యవహారంలో తెరపైకి కృష్ణా జలాల అంశం.. KRMBకి తెలంగాణ సర్కార్ లేఖ
Krishna River Management Bo

Edited By: Srikar T

Updated on: Apr 21, 2024 | 1:34 PM

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా టెయిల్‌పాండ్‌ కేంద్రంగా ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం తెరపైకి వచ్చింది. టెయిల్‌ పాండ్‌ నుంచి ఏపీ సర్కార్ అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని KRMBకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం చర్చనీయాంశమైంది.

టెయిల్‌పాండ్‌ నుండి నీటిని తరలింపు..

నాగార్జున సాగర్ కేంద్రంగా గత ఏడాది నవంబర్‎లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం టెన్షన్‎కు దారితీసింది. దీంతో ప్రధాన డ్యాం పూర్తిగా KRMB పర్యవేక్షణలో కేంద్ర బలాగాల పహారాలో ఉంది. ఇప్పటికీ డ్యాం నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల పంపిణీపై KRMB ఇరు రాష్ట్రాలతో చర్చిస్తూనే ఉంది. తాజాగా తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల్లో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపికి ఐదు టీఎంసీల నీటిని KRMB కేటాయించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ.. టెయిల్ పాండ్‎లోని నీటిని అనుమతి లేకుండా తరలించింది. నాగార్జున సాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్‎లో నీటి నిల్వలు ఖాళీ అయ్యాయి. కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి ఏపీ సర్కార్ మొత్తం నీటిని తరలించింది. టెయిల్‌పాండ్‌ తెలంగాణ జెన్ కో ఆధీనంలో ఉంది. అత్యవసర సమయాల్లో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం టెయిల్ పాండ్‎లో 6.5 టీఎంసీల నీరు ఉండగా, నాలుగు రోజుల క్రితం టెయిల్ పాండ్ కుడివైపు నుంచి 4 టీఏంసీల నీటిని అనుమతి లేకుండా ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు తరలించారు.

టెయిల్‌పాండ్‌ వివాదంపై KRMBకి తెలంగాణ సర్కార్ లేఖ..

ఏపీ సర్కార్ టెయిల్ పాండ్ నీటి తరలింపుపై తెలంగాణ జెన్కో, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి తెలిపారు. ఈ మేరకు టెయిల్‌పాండ్‌ నుంచి నీటి విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ సర్కార్ KRMBకి లేఖ రాసింది. టెయిల్‌పాండ్‌ నుండి నీటి తరలింపుతో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది. సాగర్‌ జల విద్యుత్‌ కేంద్రం అవసరాల కోసమే టెయిల్‌పాండ్‌ నిర్మించారని, దానిలో 6.737 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఏపీ ప్రభుత్వం 4 టీఎంసీల వరకు తరలించిందని KRMB చైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌కు, ఈఎన్‌సీ అనిల్‌కుమార్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు.   నీటి అవసరాలు కోసం టెయిల్‌పాండ్‌ కట్టలేదని, కేవలం నాగార్జున సాగర్ జల విద్యుత్‌ కేంద్రంలో రివర్సబుల్‌ పంపింగ్‌ కోసం కట్టారని గుర్తు చేశారు. కృష్ణా బోర్డు జోక్యం చేసుకుని తక్షణమే నీటి విడుదలను నిలిపివేయాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి

నీటి తరలింపుకు సీఎం రేవంత్, మంత్రులదే బాధ్యత..

రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే కృష్ణ జలాలను ఏపీ సర్కార్ తరలించిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే నాగార్జునసాగర్ డ్యాం‎ను ఏపీ సర్కార్‎కు అప్పగించి తమ చేతగానితనాన్ని తెలంగాణ సర్కార్ బయట పెట్టుకుందని అన్నారు. టెయిల్‌పాండ్‌ నుండి నీటి తరలింపుకు సీఎం రేవంత్, ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..