తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని బీజేపీ తప్పుబడుతుంటే.. టీఆర్‌ఎస్ కేంద్రంలో బీజేపీపై ఫైర్ అవుతోంది. తెలంగాణ అభివృద్ధి కేంద్రప్రభుత్వం ఎన్నో నిధులిస్తోందని బీజేపీ నేతలు చెబుతంటే.. తెలంగాణకు నిధులివ్వడంలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలను గత రెండు నెలల నుంచి ఇవ్వడం లేదని, తక్షణమే కూలీల డబ్బులివ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి ఇక్కడి పేద ప్రజల పాలిట శాపంగా మారిందని ఈ సందర్భంగా విమర్శించారు. చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకుండా తెలంగాణ ప్రజల గోస తీస్తోందని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న దాదాపు లక్షా 25 వేల మంది కూలీలకు గత రెండు నెలల పనుల నిమిత్తం 110.35 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉందని లేకలో పేర్కొన్నారు. పేద ప్రజలు చేసిన పని వేతనం కూడా కేంద్రప్రభుత్వం రెండు నెలల నుంచి ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే బకాయి నిధులు విడుదల చేయాలని మంత్రి తన లేఖలో కోరారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటే.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రానికి నిధులివ్వడంలో కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్ విమర్శిస్తుంటే.. కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించి.. కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్తున్న పన్నులకు, తిరిగి రాష్ట్రానికి వస్తున్న నిధులకు ఎంతో వ్యత్యాసం ఉందని టీఆర్ఎస్ చెబుతంటే.. నిబంధనల ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులిస్తున్నామని, అనేక అభివృద్ధి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించామని కేంద్రం చెప్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వ పథకాలను అమలుచేయడంతో, సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ప్రభత్వం విఫలమైందంటూ బీజేపీ విమర్శిస్తోంది. మొత్తం మీద తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంచాయతీ నడుస్తూనే ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..