Telangana: మహిళలకు వెనువెంటనే మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..

మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆడబిడ్డల అండతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని, మహిళల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. .. ..

Telangana: మహిళలకు వెనువెంటనే మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్..
Cm Revanth Reddy

Updated on: May 25, 2026 | 8:28 PM

తెలంగాణలో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ్టి నుంచి ప్రభుత్వం మహిళా వారోత్సవాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 8వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాలకు సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లలో మహిళా సంఘాలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి వీలుగా ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ వేదికగా మహిళా సంఘాలకు రాయితీపై రైస్ మిల్లులు, సూపర్ బజార్లు వంటివి కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల చెల్లింపులు, ఆర్థిక సహాయంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. ఆడబిడ్డల అండతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఆటో డ్రైవర్లను, కార్మికులను రెచ్చగొట్టి మహిళలకు ఉచిత బస్సు పథకానికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, కొంత మందికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం నచ్చలేదని విమర్శిస్తూ ప్రచారం చేశారని అన్నారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని, మహిళలను బస్సులకు యజమానులు చేశామని అంబానీ, అదానీ చేసే పెట్రోల్ వ్యాపారం మహిళలు కూడా చేయాలనే బంక్‌లు పెట్టించామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వస్తున్న రవాణా, హమాలీ, రైస్ మిల్లుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా.. భవిష్యత్‌లో రైస్ మిల్లులను కూడా మహిళా సంఘాలకే కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా లాజిస్టిక్ గోడౌన్లు నిర్మించి ఇస్తామన్నారు. భవిష్యత్తులో మహిళా సంఘాల గోడౌన్లలోనే ధాన్యం నిల్వ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఆర్టీసీలో కేవలం ఉచిత ప్రయాణమే కాదు.. భవిష్యత్తులో మహిళలనే బస్సులకు యజమానులను చేయబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంక్ లింకేజ్ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు . మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి అండ.. ఒక అన్నగా ప్రభుత్వం పెట్టే సారె లాంటిదంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సంఘాల ఆధ్వర్యంలోనే సూపర్ బజార్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ భూములను నామమాత్రపు అద్దెలతో లీజుకు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us