సర్కారీ దవాఖానాకు మాయరోగం.. వైద్యం కోసం వీల్ చైర్ పై మూడు కిలో మీటర్ల ప్రయాణం
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం, కనీస సదుపాయాల కొరత తాండవిస్తోంది. వీల్ చైర్ లేక రోగులు అవస్థలు పడటం, మందుల కొరతతో ఆందోళనలు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వంటి ఘటనలు ప్రభుత్వ వైద్య వ్యవస్థకు పట్టిన "మాయరోగం"ను స్పష్టం చేస్తున్నాయి. పేదలకు మెరుగైన వైద్యం అందాలంటే వ్యవస్థాగత మార్పులు అనివార్యం.

పేదల పెద్ద దిక్కుగా కొనసాగుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మారడం లేదా. ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మార్పు రావడం లేదా. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని పాలకులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా. యస్.. అదే నిజం అంటోంది ఉమ్మడి ఆదిలాబాద్. పేదోడికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షే అన్న తీరును కళ్లకు కడుతోంది. మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్.. ప్రాంతాలు వేరైనా పరిస్థితులు ఒక్కటే. నిర్లక్ష్యం.. వైద్య సిబ్బంది పొగరుపోతు తనం.. వెరసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యో నారాయణో హరి అనాల్సిన దుస్థితి. ప్రభుత్వ వైద్య వ్యవస్థకు మాయం రోగం పట్టుకుందని రుజువు చేస్తున్నాయి ఈ మూడు ఘటనలు.
అర్థరాత్రి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆందోళన
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అర్థరాత్రి రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని.. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటితో ఆగకుండా.. ఆస్పత్రి నుంచి రోగిని వీల్ చైర్ పై తీసుకుని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఇంటికి వెళ్లారు. అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటి ముందు సాయం కోసం ఎదురు చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాదితులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు.
అసలేం జరిగిదంటే..
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన భూక్యా బుజ్జి (55) కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. మంగళవారం (సెప్టెంబర్ 29) అర్థరాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుమారుడు భూక్యా రాజ్‌కుమార్ అర్థరాత్రి సమయంలో మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అర్థరాత్రి కావడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించారని.. కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ లేడని.. డయాలసిస్ కూడా లేదని.. బెడ్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన బాధిత కుటుంబం న్యాయం కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఇంటికి బయలు దేరారు. ఆస్పత్రి నుండి ఎమ్మెల్యే ఇంటి వరకు వీల్ చైర్ లో రోగిని తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే సహాయకులు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరు స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు ఎంతకు వినకపోవడంతో విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంవో శ్రీధర్ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి తల్లీకొడుకులలను తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఇలా ఉంటే అదే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కోసం రోగులు ఆందోళనకు దిగారు.
మందుల కోసం బెల్లంపల్లి ఆస్పత్రిలో ఆందోళన
బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. వైద్యులు రాసిచ్చిన మందులు ఆస్పత్రిలో ఇవ్వడం లేదంటూ రోగులు, వారి బంధువులు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. మందుల స్టాక్ లేదని.. మరో మూడు నెలల వరకు మందులు వచ్చే అవకాశం లేదని సిబ్బంది చెప్పడంతో రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న పేద రోగులకు కనీసం అవసరమైన మందులు కూడా అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రిమ్స్‌లోనూ మారని పరిస్థితులు
ఇక ఆదిలాబాద్ రిమ్స్‌లోనూ రోగుల అవస్థలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కాలు విరిగి చికిత్స కోసం వచ్చిన ఓ రోగికి వీల్‌చైర్ అందుబాటులో లేకపోవడంతో.. కుంటు కుంటూనే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేషెంట్ కేర్, వైద్య సిబ్బంది తీరుపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రిమ్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన తర్వాత ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధికారులు.. ఇకపై పరిస్థితులు మారుతాయని చెప్పినా.. తాజాగా వెలుగు చూస్తున్న ఘటనలు మాత్రం క్షేత్రస్థాయిలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ప్రమాదం జరిగినప్పుడే హడావుడి.. !
ఒకవైపు ఆస్పత్రుల్లో రోగులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు.. మరోవైపు మందుల కొరత.. ఇంకోవైపు కనీస సౌకర్యాలు లేక రోగుల అవస్థలు.. ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ వైద్య వ్యవస్థలో.. రోగి ఆస్పత్రి గడప తొక్కినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి దశలో బాధ్యతాయుతమైన సేవలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మాయరోగం పట్టిన ప్రభుత్వ ఆస్పత్రులు తీరు మార్చుకోవడం లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
