తెలంగాణ లిక్కర్ వ్యాపారంపై సరికొత్త టక్కర్.. లోకల్ వ్యాపారుల అభ్యంతరం!
తెలంగాణలో మద్యం షాపుల టెండర్ల వ్యవహారం.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. "మా రాష్ట్రం.. మా వ్యాపారం.. మధ్యలో మీకేంటి సంబంధం..?" అని ఏపీ వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ మద్యం వ్యాపారులు. తెలంగాణ మద్యం షాపులను తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు.

తెలంగాణలో మద్యం షాపుల టెండర్ల వ్యవహారం.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. “మా రాష్ట్రం.. మా వ్యాపారం.. మధ్యలో మీకేంటి సంబంధం..?” అని ఏపీ వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ మద్యం వ్యాపారులు. తెలంగాణ మద్యం షాపులను తెలంగాణ వారికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం అందించారు. మరోవైపు మద్యం టెండర్ల గడువు పెంపును కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు.
లిక్కర్ వ్యాపారంపై సరికొత్త టక్కర్ మొదలయింది. తెలంగాణలోని మద్యం షాపులకు ఏపీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు స్థానిక వ్యాపారులు. ఏపీకి చెందిన రాజకీయ నేతల బినామీలు ఇక్కడ దరఖాస్తు చేస్తున్నారని అలాంటి వ్యవహారాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలంటున్నారు. తెలంగాణలోని మద్యం షాపులను తెలంగాణ వారికే కేటాయించాలని TG బార్ & రెస్టారెంట్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు నాంపల్లి ఆబ్కారీ భవన్‌లోని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించారు.
తెలంగాణలోని 2 వేల 620 మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. లక్కీ డిప్‌లో దక్కే లైసెన్సు 2027 వరకు పనిచేస్తుంది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు అక్టోబర్ 18తో ముగియాల్సి ఉంది. అయితే చివరి రోజున ‘బీసీ-బంద్’ కారణంగా చాలామంది వ్యాపారులు దరఖాస్తులు చేయలేకపోయారన్న ప్రభుత్వం.. దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకూ పొడిగించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రా వ్యాపారులకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు. గడువు పొడిగించటంతో ఏపీ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వందల సంఖ్యలో టెండర్లు వేస్తున్నట్టు తాము గుర్తించామని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు డ్రాలో లైసెన్స్ దక్కితే దాన్ని భారీ ధరకు అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో కూడా చాలామంది ఏపీ వ్యాపారులు దరఖాస్తు చేశారని చెబుతున్నారు.
అయితే మద్యం షాపులకు అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు రాకపోవడం వల్లే ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించిందన్న వాదన వినిపిస్తోంది. మద్యం దుకాణం లైసెన్స్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం 2 లక్షల రూపాయల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. ఈ నాన్-రిఫండబుల్ ఫీజు పెంపు.. వ్యాపారులపై అదనపు భారాన్ని మోపిందని, అందువల్లే ఈసారి లక్షలోపే దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు. మరోవైపు జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలోని మద్యం షాపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. దీంతో అక్కడి వ్యాపారుల నుండి తెలంగాణ మద్యం షాపుల టెండర్లలో పాల్గొనేవారు. అందుకే 2023లో తెలంగాణలో మద్యం దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 1.32 లక్షలకు చేరింది. అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా అప్లికేషన్లు స్వీకరించి లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించింది. దీంతో అక్కడి వ్యాపారుల నుంచి వచ్చే దరఖాస్తుల తగ్గాయన్న వాదన కూడా వినిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




