Tamilisai Soundararajan: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. కాకతీయ యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి హాజరవుతారు. రాష్ట్రంలో బీజేపీ-TRS వార్ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ వరంగల్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎన్నో పోరాటాలకు పురుడుపోసిన కాకతీయ యూనివర్సిటీలో గవర్నర్ పర్యటన హై టెన్షన్ సృష్టిస్తోంది. 25వ తేదీన గవర్నర్ తమిళి సై వరంగల్ పర్యటన ఖరారైంది. కాకతీయ యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. 2019-2020 సంవత్సరంలో వివిధ కోర్స్ లలో పీ.హెచ్.డీ పూర్తి చేసుకున్న 56 మందికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు 276 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారు.
గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనేక పోరాటాలకు వేదికగా మారిన కాకతీయ యూనివర్సిటీ లో గవర్నర్ కార్యక్రమాలు ఉండడంతో ఆసక్తికరంగా మారింది. కే.యూలో బోధన-బోధనేతర సిబ్బందితో కలిపి 11 కమిటీలు వేశారు. ఉదయం 7.20 నిమిషాలకు రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.10 గంటలకు కాకతీయ యూనివర్సిటీకి చేరుకుంటారు. 10.25 నిమిషాల నుండి 12.45 నిమిషాల వరకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సంలో పాల్గొంటారు.
12.55కు యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌కు చేరుకొని మధ్యాహ్న భోజనం చేస్తారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్ కు వెళ్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, బీజేపీ-TRS వార్ నేపథ్యంలో గవర్నర్ పర్యటన ఉత్కంఠత రేపుతోంది. గవర్నర్ పర్యటనకు పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ లోనికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. స్నాతకోత్సం జరిగే ఆడిటోరియం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి