Telangana: ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ ఫైటింగ్‌ ముగిసినట్లేనా? ప్రసంగంలో తరువాత సీన్ మారుతుందా?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై చిక్కుముడి వీడిందా.. ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ ఫైటింగ్‌ కొలిక్కి వచ్చిందా.. హైకోర్టు సాక్షిగా మేటర్‌ సెటిలైందా..అసలు ఇందులో ఎవరు తగ్గారు.. ఎవరు నెగ్గారు.

Telangana: ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ ఫైటింగ్‌ ముగిసినట్లేనా? ప్రసంగంలో తరువాత సీన్ మారుతుందా?
Cm Kcr Vs Governor Tamilsai

Updated on: Jan 31, 2023 | 8:59 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై చిక్కుముడి వీడిందా.. ప్రగతిభవన్‌, రాజ్‌భవన్‌ ఫైటింగ్‌ కొలిక్కి వచ్చిందా.. హైకోర్టు సాక్షిగా మేటర్‌ సెటిలైందా..అసలు ఇందులో ఎవరు తగ్గారు.. ఎవరు నెగ్గారు.

తమిళిసై జేజమ్మలా పంతం నెగ్గించుకున్నారా..?

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై జేజమ్మలా పట్టిన పట్టు విడవకుండా.. పంతం నెగ్గించుకున్నారా.. చివరకు తానే నెగ్గారా.. రెండేళ్ల నుంచీ తనను అవమానిస్తున్నారంటూ పదే పదే చెప్పుకొచ్చిన తమిళిసై ఇప్పుడు చల్లబడ్డారా..

సింహం వెనక్కు తగ్గిందా?

సింహం వెనక్కు తగ్గిందా.. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన కేసీఆరే..రెండడుగులు వెనక్కు తగ్గారా..?

ఇవి కూడా చదవండి

ఇరువర్గాల మధ్య ఒప్పందం..

ఏదేమైనా.. మొత్తానికి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై చిక్కుముడి వీడింది. ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్‌ చేసే ప్రసంగంతోనే బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం హైకోర్టు వరకు వెళ్లినా.. ఇరువర్గాల మధ్య ఒప్పందంతో సద్దుమణిగింది. కోర్టు సూచనల మేరకు.. బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ అనుమతి ఇచ్చేలా, సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగానికి ప్రభుత్వం అంగీకరించేలా ఏర్పాటు జరిగింది. రాష్ట్ర బడ్జెట్‌ 2023–24 సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతోనే ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇరువర్గాల విజ్ఞప్తితో కోర్టు ఈ పిటిషన్‌లో వాదనలను ముగించింది.

గవర్నర్‌ ఆమోదం రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం..

రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించింది. గడువు సమీపిస్తున్నా బడ్జెట్‌కు గవర్నర్‌ నుంచి ఆమోదం రాలేదు. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలంటూ ఈనెల 21వ తేదీనే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని స్పష్టంచేసింది.. వెంటనే అనుమతి ఇచ్చేలా రాజ్‌భవన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా లంచ్‌ మోషన్‌లో విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీల ధర్మాసనానికి అడ్వొకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు.

గవర్నర్‌ విధుల్లో కోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చా?

అయితే గవర్నర్‌ విధుల్లో కోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చా? నోటీసులు ఇవ్వొచ్చా? కోర్టులు అతిగా జోక్యం చేసుకుంటున్నాయని మీరే చెప్తుంటారు కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రభుత్వం తరఫున వాదన వినిపించారు.

ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రభుత్వమే సుప్రీం..

బడ్జెట్‌ అనేది కోట్లాది మంది ప్రజలతో ముడిపడిన సున్నితమైన అంశం. దీనిపై గవర్నర్, సర్కార్‌ మధ్య ప్రతిష్టంభన సరికాదు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రభుత్వమే సుప్రీం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల సందర్భంగా వెల్లడించింది. కారణం లేకుండా బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడం సరికాదు. గవర్నర్‌ రాజ్యాంగానికి లోబడి ఉండాలి, ప్రభుత్వంతో కలసి పనిచేయాలే తప్ప.. సమాంతర ప్రభుత్వాన్ని నడపకూడదు. వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఓ పార్టీ చెప్పిన వాటిని వినకూడదని దవే చెప్పారు.

గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న లాయర్‌ అశోక్‌..

ఇక మీరే అంతగా చెబితే.. తామేం తక్కువ తిన్నామా అన్నట్లు..గవర్నర్‌ కార్యాలయం తరఫున సీనియర్‌ న్యాయవాది అశోక్‌ ఆనంద్‌ కుమార్‌ వాదించారు. ప్రభుత్వం హుందాగా వ్యవహరించడం లేదు. బడ్జెట్‌ ఫైల్‌ పంపాలని గవర్నర్‌ కోరినా సీఎంవో నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. గవర్నర్‌ ప్రసంగం ఉంటుందా? ఉండదా? అనేది కూడా చెప్పడం లేదు. గత ఏడాది కూడా గవర్నర్‌ ప్రసంగం లేదు. గణతంత్ర వేడుకలకు సీఎం హాజరుకాలేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌పై మంత్రులు అనుచిత, అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారు.మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఇలా పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు..

భోజన విరామ సమయంలో చర్చ..

ఆ తర్వాత కోర్టు సూచనతో.. భోజన విరామ సమయంలో న్యాయవాదులు ప్రభుత్వం, రాజ్‌భవన్‌తో మాట్లాడి, చర్చించుకున్నారు. ఈ వివరాలను కోర్టుకు తెలిపారు. తమ సమస్య పరిష్కారమైందని వివరించారు. ‘మంత్రి వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానిస్తారు. గవర్నర్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలపాలి. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగం కాపీని చదవాలి. పెండింగ్‌ బిల్లులపైనా చర్చ జరిగింది. న్యాయపరమైన అంశాలుంటే సంబంధిత అధికారులు వివరణ ఇస్తారు.’ అని దుష్యంత్‌ దవే కోర్టుకు చెప్పారు. మరోవైపు,. బడ్జెట్‌కు ఆమోదం తెలిపేలా గవర్నర్‌ కార్యాలయం చర్యలు తీసుకుంటుదని అశోక్‌ ఆనంద్‌ వెల్లడించారు. ఇంకేముందీ. ఖేల్‌ ఖతమ్‌.. దుకాణం బంద్‌.

బడ్జెట్‌ ప్రసంగం చేయాలని గవర్నర్‌ను కలిసిన మంత్రి వేముల..

వెంటనే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.. రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్‌ను కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి..ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరారు.. ఆ తర్వాత నేరుగా ప్రగతి భవన్‌ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఆ తర్వాత చాలాసేపు..గవర్నర్ ప్రసంగంపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు.

నేతల విమర్శలు..

మరోవైపు గవర్నర్‌ తీరును బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజ్‌భవన్లను రాజకీయ కేంద్రాలుగా మారుస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్‌. గవర్నర్‌ను తప్పుబడుతున్న వారు, స్పీకర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై ఏం చెబుతారని ప్రశ్నించారు బండి సంజయ్‌. రాజ్యాంగ వ్యవస్థలపై బీఆర్ఎస్‌నేతలకు గౌరవం లేదన్నారు మహేశ్వర్‌ గౌడ్.

మొత్తానికి ఉప్పునిప్పుగా ఉన్న ప్రగతి భవన్, రాజ్‌భవన్‌ రాజీ పడినట్లేనని రాజకీయ పండితులు చెబుతున్నారు.గోటితో పోయేదానికి గొడ్డలిదాకా ఎందుకన్నట్లు..బడ్జెట్‌ ప్రసంగం గవర్నర్‌ చేత ఇప్పించకపోతే..మున్ముందు ఢిల్లీ పెద్దలతో చాలా చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.. ఈ విషయం కేసీఆర్‌కు తెలియనిది కాదు..అందుకే హైకోర్టు వేదికగా ఇలా రాజీ పడ్డారని.. ముందు బడ్జెట్‌ ప్రసంగం ముగిస్తే.. ఆతర్వాత లెక్క వేరే ఉంటుందనే వాళ్లూ లేకపోలేదు. మరి..ఏం జరుగుతుందో ఎదురు చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..