Vaccinate All: కరోనాను జయించాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని గవర్నర్ పిలుపు

Vaccinate All: దేశంలో కరోనా వైరస్ మూడో దశ రానున్నదని తగిన చర్యలు ముందుగానే తీసుకోవాలని ఓ వైపు వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు..

Vaccinate All: కరోనాను జయించాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని గవర్నర్ పిలుపు
Telangana Governor
Follow us

|

Updated on: Jul 24, 2021 | 4:29 PM

Vaccinate All: దేశంలో కరోనా వైరస్ మూడో దశ రానున్నదని తగిన చర్యలు ముందుగానే తీసుకోవాలని ఓ వైపు వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ క‌రోనా వైర‌స్ ను ఎదుర్కోవ‌డానికి వీలుగా ప్రతి ఒక్క‌రూ టీకా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ‌కు చెందిన రీజిన‌ల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్ఓబీ)  కోవిడ్ జాగ్ర‌త్త‌లు, వ్యాక్సినేష‌న్‌పై ఏర్పాటుచేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహ‌నాల‌ను శ‌నివారం తమిళసై రాజ‌భ‌వ‌న్‌లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజల్లో కోవిడ్ టీకాపై ఉన్న సంశ‌యం క్ర‌మంగా తొలగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం భార‌త్ 42 కోట్ల మందికిపైగా ప్ర‌జ‌ల‌కు టీకా అందించి .. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మందికి టీకాలు అందించిన దేశాల‌లో ఒక‌టిగా అవ‌త‌రించింద‌ని అన్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకుని కరోనా వైర‌స్ ప‌ట్ల బాహుబ‌లిగా మారాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి పిలుపును ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీకా ప‌ట్ల సంశ‌యాలు ఉన్న గ్రామీణ‌, గిరిజ‌న ప్రాంతాల‌కు ప్రధాని మోడీ పిలుపుని చేర‌వేయాల‌ని గవర్నర్ తమిళ సై చెప్పారు. ఈ సందర్భంగా తాను స్వ‌యంగా ఇటీవ‌ల ఒక గిరిజన ప్రాంతంలో కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ టీకా ఆవ‌శ్య‌క‌త‌పై ప్ర‌ధాని త‌ర‌చుగా ఇస్తున్న సందేశాలు, 18 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ ఉచిత టీకాలు అందించాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లంద‌రికీ చేర‌వేయాల‌ని ఆమె అన్నారు.

కోవిడ్ వ్యాక్సినేష‌న్‌పై స‌రైన స‌మ‌యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నందుకు రీజ‌న‌ల్ ఔట్‌రీచ్ బ్యూరోను అభినందించిన గ‌వ‌ర్న‌రు, ఆర్ఓబీ రూపొందించిన ల‌ఘు చిత్రాలు, క్రియేటివ్స్ ప్ర‌జ‌ల‌లో టీకాల‌పై అవ‌గాహ‌న పెంచ‌డానికి ఎంతో దోహ‌ద ప‌డ‌తాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

గ‌వ‌ర్న‌రు ప్రారంభించిన ప‌ది మొబైల్ డిజిట‌ల్ ప్ర‌చార వాహ‌నాల‌ ద్వారా వారం రోజుల పాటు అన‌గా జులై 24 నుంచి 30 వ‌ర‌కు రాష్ట్రంలోని 29 జిల్లాలు – అదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, జ‌గిత్యాల‌, జ‌న‌గాం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల‌, కామారెడ్డి, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, కోమ‌రం భీమ్ అసిఫాబాద్‌, మ‌హ‌బూబాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మంచిర్యాల‌, మెద‌క్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, న‌ల్గొండ‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్ద‌ప‌ల్లి, రాజ‌న్న సిరిసిల్ల‌, సంగారెడ్డి, సిద్ధిపేట‌, సూర్యాపేట‌, వికారాబాద్‌, వ‌న‌ప‌ర్తి, వ‌రంగ‌ల్ (రూర‌ల్‌), వ‌రంగ‌ల్ (అర్బ‌న్‌), యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌చార కార్‌ంక్ర‌మాలు నిర్వ‌హిస్తారు. ఈ వీడియో వ్యాన్లు ఆయా జిల్లాల్లోని జ‌న స‌మ్మ‌ర్థం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా – రైల్వే స్టేష‌న్లు, బ‌స్ స్టేష‌న్లు, మార్కెట్లు, వ్యాపార కూడ‌ళ్ళు, ట్రాఫిక్ జంక్ష‌న్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తాయి. కోవిడ్ వ్యాక్సిన్ పై సమాజం లోని కొన్ని వర్గాల్లో సందేహాలు నెలకొనడం, కొన్ని ప్రాంతాల్లో టీకాలు తీసుకున్నవారి సంఖ్య తక్కువగా నమోదు అవుతున్న దృష్ట్యా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ఓబీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (సౌత్‌) శ్రీ ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్‌, డైరెక్ట‌ర్ శ్రీ‌మితి శృతిపాటిల్‌,  డెప్యూటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్‌తోపాటు రాజభ‌వ‌న్ సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు.

Also Read: Hyderabad: ట్రాఫిక్ జామ్‌లో చిక్కున్న అంబులెన్స్ .. దారి ఇవ్వడానికి ప్రోటోకాల్ అడ్డంటూ పోలీసు వాదన