ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టే కనిపిస్తున్నాయ్. అవును, గవర్నర్ అండ్ గవర్నమెంట్ మధ్య ఎవరూ పూడ్చలేనంతగా అగాధం ఏర్పడింది. అందుకు రుజువే లేటెస్ట్ ఎపిసోడ్. గవర్నర్ టార్గెట్‌గా అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది కేసీఆర్ సర్కార్. అది ఇవాళ సుప్రీంలో విచారణకు రాబోతోంది. మరి, తెలంగాణ ప్రభుత్వ రిట్ పిటిషన్‌పై సుప్రీం ఎలా రియాక్ట్ కాబోతుంది!. ఊరట లభిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎవర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నేను గైనకాలిజిస్ట్‌ని, ఆమాత్రం తెలియదా నాకు!. సరిగ్గా నెలరోజులక్రితం గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలివి. ఈ కామెంట్స్ ఎవర్నుద్దేశించి చేశారో ఊహించుకోవచ్చు. గవర్నర్ స్పీచ్ లేకుండానే బడ్జెట్ సమావేశాలను కానిచ్చేయాలనుకున్న ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చుకున్న తమిళిసై అదే పంథా కంటిన్యూ చేస్తున్నారు. దానికి రుజువే లేటెస్ట్ ట్విస్ట్. బడ్జెట్ సమావేశాల టైమ్‌లో కోర్టుకెళ్లి వెనక్కితగ్గిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ సుప్రీం గడప తొక్కింది. బిల్లులు ఆమోదించడం లేదంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం ఎంతగా పెరిగిపోయిందో చెప్పడానికిదో ఉదహరణ మాత్రమే.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది బిల్లులు ఆగిపోయాయ్, ఆరు నెలలుగా రాజ్‌భవన్ గడప దాటి బయటికి రావడం లేదవి. ఇవన్నీ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయ్. ఎన్నిసార్లు రిమైండ్ చేసినా నెత్తీనోరు బాదుకున్నా అట్నుంచి ఆన్సర్ రాకపోవడంతో మరో దారిలేక సుప్రీం మెట్టెక్కింది కేసీఆర్ సర్కార్. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను ప్రతివాదులుగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వం… బిల్లులను ఆమోదించేలా ఆదేశించండంటూ సుప్రీంను కోరింది.
ఈ బిల్లులన్నీ గతేడాది సెప్టెంబర్‌లోనే అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ ముద్ర కోసం రాజ్‌భవన్‌కి పంపింది. కానీ, ఇప్పటివరకూ అతీలేదు గతీ లేదు. అయితే, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నా… దీనివెనుక ఎటువంటి దురుద్దేశం లేదనేది గవర్నర్ తమిళిసై వెర్షన్.
ఉప్పూనిప్పులా ఉంటోన్న తమిళిసై, కేసీఆర్‌లు బడ్జెట్ సెషన్స్ టైమ్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఇక అంతా ప్రశాంతం, ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. కానీ లేటెస్ట్ ఎపిసోడ్‌తో అది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని తేలిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ సుప్రీం గడప తొక్కడంతో కథ మొదటికొచ్చినట్టయ్యింది. ఈ ఎపిసోడ్‌తో అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు పూర్తిగా తెగిపోయినట్టే. ఎవరూ పూడ్చలేనంతగా ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య అగాధం ఏర్పడినట్టే కనిపిస్తోంది. బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. మరి, సుప్రీం ఎలా రియాక్టవుతుందో చూడాలి!.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..