Migrant Workers: తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతుంటే మరోవైపు వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో 5 లక్షల నుంచి 8 లక్షల మంది వలస కార్మికులకు టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందు కోసం త్వరలో ఒక ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. కార్మికుల యజమానుల మార్గదర్శకాలు లేకపోవడం, వ్యాక్సిన్ల కొరత ఉండటం కారణంగా వలస కార్మికులు వ్యాక్సిన్ పొందలేకపోతున్నారని తెలిపింది. సెకండ్‌వేవ్ కరోనా తర్వాత 40 శాతంపైగా వలస వచ్చిన కార్మికులు టీకా కోసం తమ స్వగ్రామాలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అయితే నగరంలో వలస వచ్చిన వారు, ఇతర జిల్లాల్లో పని చేసే కార్మికులు టీకా కోసం ప్రభుత్వం త్వరలో ప్రారంభించే కొత్త పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని కార్మిక శాఖ తెలిపింది. రిజిస్ట్రేషన్ సమయంలో కార్మిక శాఖ అధికారులు, సంబంధిత యజమానులు వారికి సహాయం చేయాలని తెలంగాణ కార్మిక విభాగం జాయింట్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. వలస కార్మికులు తమ పేర్లు, రాష్ట్రం పేరు, ఆధార్ వివరాలు పోర్టల్‌లో తప్పకుండా నమోదు చేయాలని, కార్మికుల కోసం వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి ,వాటి అసంఘటిత కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డుతో అనుసంధానించడానికి డేటా సహాయ పడుతుందని ఆయన అన్నారు. అయితే మొదటి టీకా తీసుకున్న కార్మికులు ఈ పోర్టల్‌లో రెండో దశ టీకా కోసం నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.