Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇది కదా కావాల్సింది

విద్యా రంగంలో డిజిటల్‌ విప్లవం కొనసాగుతున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 22,000కు పైగా స్కూళ్లలో బీఎస్ఎన్ఎల్‌, టీ–ఫైబర్‌ సంస్థల ద్వారా కనెక్షన్లు ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇది కదా కావాల్సింది
School Students

Edited By:

Updated on: Nov 07, 2025 | 7:43 PM

డిజిటల్‌ యుగం ప్రతి రంగాన్నీ తాకుతోంది. బ్యాంకింగ్‌ లావాదేవీల నుంచి పాఠశాల తరగతుల వరకూ టెక్నాలజీ డామినేషన్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్ ఈ అంశంలో ముందంజలో ఉంది. గతంలోలా బోర్డు మీద రాసే పాఠాలు, టీచర్‌ నోటితో చెప్పే లెస్సన్స్‌కే పరిమితం కాకుండా, ఇప్పుడు స్మార్ట్‌ స్క్రీన్‌లపై చిత్రాలు, వీడియోలు, యానిమేషన్లతో టీచింగ్ సాగుతోంది. కరోనా మహమ్మారి తర్వాత ఈ డిజిటల్‌ విద్యా విధానం మరింత వేగంగా విస్తరించింది. అయితే ప్రైవేట్‌ పాఠశాలలు ఈ మార్పును వేగంగా స్వీకరించినప్పటికీ, ప్రభుత్వ బడులు మాత్రం సదుపాయాల కొరత వల్ల వెనుకబడి ఉన్నాయని అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ గ్యాప్‌ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించనుంది.

ఈ ప్రాజెక్టు అమలుకు పాఠశాల విద్యాశాఖ బీఎస్ఎన్ఎల్‌, టీ–ఫైబర్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 26,887 ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో సుమారు 24,984 స్కూళ్లలోనే విద్యార్థులు చదువుతున్నారు. అయితే సుమారు వెయ్యి పాఠశాలల్లో ఇప్పటికీ కంప్యూటర్లు లేని పరిస్థితి ఉంది. కంప్యూటర్లు ఉన్న 22,730 పాఠశాలలకు తొలి విడతలో ఉచిత ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బీఎస్ఎన్ఎల్‌ 5,342 పాఠశాలలకు, టీ–ఫైబర్‌ 5,000 పాఠశాలలకు సేవలు అందించనుంది. బీఎస్ఎన్ఎల్‌ ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో కనెక్షన్లు పూర్తి చేసినట్టు సమాచారం.

తదుపరి దశలో 12,388 పాఠశాలలకు సేవలు విస్తరించనున్నారు. వీటిలో 9,404 బడులకు బీఎస్ఎన్ఎల్‌ కనెక్షన్లు, మిగతా 2,984 పాఠశాలలకు టీ–ఫైబర్‌ ఇంటర్నెట్‌ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్ష పథకం ద్వారా ప్రభుత్వం విడుదల చేయనుంది. కనెక్షన్లు ఆలస్యమైతే, స్కూల్‌ హెడ్‌మాస్టర్లు స్వయంగా ఇతర ప్రైవేట్‌ సర్వీసులు తీసుకునే అవకాశమూ కల్పించారు. ఆ ఖర్చును స్కూల్‌ గ్రాంట్‌ నుంచి భరించవచ్చని విద్యాశాఖ స్పష్టంచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ టీచర్ల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ ఫ్రీ ఇంటర్నెట్‌ నిర్ణయం ప్రభుత్వ విద్యా రంగానికి మరో కొత్త ఊపు ఇవ్వనుంది.

మరిన్ని తెలంగాణ వార్తలు

 

Follow Us