
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు, అంగన్‌వాడీల్లో పిల్లలకు కొత్త ఏడాదిలో పైలెట్ ప్రాజెక్టు కింద బ్రేక్‌ఫాస్ట్ స్కీంను ప్రారంభించనుంది. మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ స్కీం ప్రారంభం కానుండగా.. 2026-27 కల్లా ఇది పూర్తిగా అమలులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది పాఠశాల విద్యాశాఖ. పేద విద్యార్థులకు పోషకాహారం అందించడంతో పాటు, పాఠశాలల్లో హాజరుశాతాన్ని పెంచాలానే ఉద్దేశంతోనే ఈ పధకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పధకం అమలుకు రూ. 400 కోట్ల ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడీ లాంటివి పెట్టనుండగా.. మరో మూడు రోజులు ఉప్మా పెట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లో, రాష్ట్రంలో 35, 781 అంగన్‌వాడీ సెంటర్లలో 8 లక్షల మంది చిన్నారులకు ఇది ప్రయోజనకరంగా మారనుంది. అటు ఇప్పటివరకు పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజనం పథకాన్ని… ఇకపై ఇంటర్ కాలేజీల్లో కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇది అమలు చేయనున్నారు. అలాగే రాష్ట్రంలోని సుమారు 120 కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..