
హైదరాబాద్ నుంచి 50 నుంచి 200 కిలోమీటర్ల పరిధిలో పచ్చని కొండలు, అరణ్యాలు, జలాశయాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు అనేకం ఉన్నా.. సరైన ప్రచారం, సమగ్ర సమాచారం లేకపోవడంతో ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్నారని టూరిజం అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ‘హైపర్ లోకల్ టూరిజం’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
వీకెండ్ ట్రిప్స్‌పై ఆసక్తి ఉన్నవారు హైదరాబాద్‌లోనే దాదాపు 10 లక్షల మంది ఉంటారని అంచనా. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేసేవారు తమ స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఒకట్రెండు రోజులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ ప్రణాళికను రూపొందించారు. శని, ఆదివారాలు లేదా ఇతర సెలవు రోజుల్లో సులభంగా వెళ్లివచ్చే ప్రాంతాలనే ఈ జాబితాలో చేర్చుతున్నారు.
క్రౌడ్ సోర్సింగ్ విధానంలో పర్యాటక ప్రాంతాల వివరాలను సేకరిస్తూ.. ఆయా ప్రదేశాలకు రోడ్డు కనెక్టివిటీ, సమీప వసతి సదుపాయాలు, అడ్వెంచర్ యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్, స్థానిక వంటకాల ప్రత్యేకతలతో కూడిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తేనున్నారు. ఇది పర్యాటకులకు ప్రయాణ ప్రణాళికను సులభతరం చేయనుంది.
ఇప్పటికే అనంతగిరి కొండలు, రంగనాయకసాగర్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, రామప్ప దేవాలయం, కుంటాల–పొచ్చెర జలపాతాలు, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట, చార్మినార్, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్, బాసర ఆలయం, వరంగల్ ఖిలా, బుద్ధవనం, సోమశిల, జోగులాంబ శక్తిపీఠం, వనపర్తి జిల్లా శ్రీరంగనాయకస్వామి ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలు ‘100 వీకెండ్ డెస్టినేషన్లు’ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
కాబట్టి రాష్ట్రంలోనే మరిన్ని అద్భుత ప్రాంతాలను టూరిస్ట్ స్పాట్‌గా మార్చి.. రాష్ట్రంలోనే పర్యాటకాన్ని విస్తరించడమే ఈ ప్రయత్నం ఉద్దేశమని టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతి తెలిపారు. రెండు, మూడు గంటల్లో చేరుకునే గమ్యస్థానాలను గుర్తించి, వాటికి విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా జిల్లాలకూ పర్యాటకుల రాక పెంచాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.