TS Govt. on Yasangi Crop: యాసంగి పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎమన్నారంటే..?

|

Nov 24, 2021 | 6:50 PM

తెలంగాణలో వరి సాగు తగ్గించాలంటోంది రాష్ట్ర ప్రభుత్వం. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు వెళ్లాలంటోంది. సర్కార్ నిర్ణయంపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

TS Govt. on Yasangi Crop: యాసంగి పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎమన్నారంటే..?
Yasangi Crop Cultivation
Follow us on

Telangana Government on Yasangi Crop: తెలంగాణలో వరి సాగు తగ్గించాలంటోంది రాష్ట్ర ప్రభుత్వం. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు వెళ్లాలంటోంది. సర్కార్ నిర్ణయంపై రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో రైతాంగం వరి నుంచి మళ్లడం సాధ్యమేనా అన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతుంటే… మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ పంటల సాగు తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం వరిసాగు చేపట్టొద్దని.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. అయితే ప్రభుత్వ ఆలోచనలను క్షేత్రస్థాయిలో రైతులు ఆచరిస్తారా? అనేది సందిగ్ధంగా మారింది.

ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయానికి కట్టుబడి ఉంటే మెల్లిగా రైతులను ఆరుతడి పంటలవైపు మళ్లించొచ్చు. అయితే, అది ప్రస్తుత యాసంగి సీజన్‌లో సాధ్యం కాకపోవచ్చనేది వ్యవసాయరంగ నిపుణుల అంచనా వేస్తన్నారు. ప్రణాళిక ప్రకారం వరి సాగును తగ్గించుకుంటూ.. వాటి స్థానంలో ఆరుతడి పంటలతో పాటు ఉద్యాన పంటల సాగును చేపట్టాలి. మార్కెటింగ్‌ సౌకర్యం, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గతంలో ఆరుతడి పంటలు సాగు చేసిన నేలల్లో ప్రత్యామ్నాయ సాగు సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. అయితే ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టులో మాత్రం ప్రత్యామ్నాయ పంటల సాగు కష్టమవుతుంది. అక్కడ ఎక్కువ రోజుల నీటి నిల్వ ఉండటం.. ఆ భూములు వరికి తప్ప ఇతర పంటలకు అనుకూలంగా లేకపోవడం లాంటి కారణాలతో అక్కడ ప్రత్యామ్నాయ పంటలు సాగు అసాధ్యమనే చెప్పాలి. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుందన్న అనుమానాలున్నాయి.

వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, శనగ పంటలకు సంబంధించి.. ఆయా జిల్లాల పరిధిలో ఎక్కడ, ఏ పంట అనుకూలమో గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి. అయితే వరికి బదులు సాగుచేయాలని సూచిస్తున్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అసలవి వరికి ప్రత్యామ్యాయం కావని.. పైగా లాభాలు కూడా ఉండబోవంటున్నారు.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని చెప్పి ఇప్పుడు వరి వద్దంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు రైతు సంఘాల నేతలు. ప్రత్యామ్నాయ పంటలు అంటూ.. వేరుశనగ, పొద్దుతిరుగుడు లాంటివి చూపిస్తున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ఇంతకుముందు ప్రభుత్వం ముందుకు రాలేదు. రెండు, మూడు జిల్లాలకే పరిమితమైన వేరుశనగను కొనడానికే నానాయాతన పడింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కొనే పరిస్థితి ఉంటుందా అన్నది బిగ్‌ టాస్క్‌గా కనిపిస్తోంది.
Read Also… అన్నం తినేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి..! జీవితంలో విజయం సాధిస్తారు..?