Telangana: తెలంగాణ రైతాంగానికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి. ముఖ్యంగా పాడి రైతులకు పండుగలాంటి వార్త. అవును, పాడిరైతుల నెత్తిన పాలుపోశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రైతుల నుంచి సేకరిస్తోన్న పాల ధరలను పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో నిర్వహించిన పాడి రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి.. విజయ డైరీ రైతులకు ఈ శుభవార్త తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు పాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించారు.
రైతుల నుండి సేకరిస్తున్న గేదె పాల ధరను లీటరు 46.69 రూపాయల నుంచి 49.40 రూపాయలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. అలాగే ఆవుపాల ధరను సైతం 33.75 రూపాయల నుంచి, 38.75 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. పాడి రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు మంత్రి తల్లసాని. కాగా, ఒకప్పుడు నష్టాల్లో ఉన్న విజయాడైరీ తెలంగాణ ఆవిర్భావం తరువాత లాభాల బాటపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విజయాడైరి నేడు ఈ స్థాయిలో నిలిచిందన్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..