Telangana: రాష్ట్రంలో రహదారుల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. భారీగా నిధుల విడుదల..

|

Dec 26, 2022 | 7:24 AM

Telangana Roads: తెలంగాణలో రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ విపక్షాలు ఆందోళనతో పాటు.. తమ ప్రాంతంలో రోడ్డు మరమ్మతులు చేయించాలంటూ ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా..

Telangana: రాష్ట్రంలో రహదారుల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. భారీగా నిధుల విడుదల..
Road Repairs (file Photo)
Follow us on

Road Rapairs in Telangana: తెలంగాణలో రహదారులు అధ్వానంగా ఉన్నాయంటూ విపక్షాలు ఆందోళనతో పాటు.. తమ ప్రాంతంలో రోడ్డు మరమ్మతులు చేయించాలంటూ ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. రోడ్డు మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణానికి కోసం రూ.2,500 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని రాష్ట్ర, జిల్లా రహదారులు పలు ప్రాంతాల్లో పాడయ్యాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. వీటికి సంబంధించిన టెండర్లను త్వరగా ఖరారు చేయాలని రహదారులు, భవనాల శాఖను ప్రభుత్వం కోరింది. మంజూరైన మొత్తంలో రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించగా, ఆ మేరకు నిధులు మంజూరయ్యాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాఖ అధికారులను కోరారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి (రూరల్‌) సర్కిళ్లలో రోడ్లపై పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

అధికారుల లెక్కల ప్రకారం, మొత్తం 27,521 కిలోమీటర్ల పొడవైన రాష్ట్ర రహదారులలో 664 చోట్ల 1,675 కిలోమీటర్ల పొడవైన రోడ్లు వర్షం కారణంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. రహదారుల మరమ్మతులకు టెండర్లు పిలిచి రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..