Telangana: గుడ్ న్యూస్.. దళిత బంధు పథకంపై అసెంబ్లీలో భట్టి కీలక ప్రకటన

ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకం కొనసాగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో భట్టి సమాధానమిచ్చారు .

Telangana: గుడ్ న్యూస్.. దళిత బంధు పథకంపై అసెంబ్లీలో భట్టి కీలక ప్రకటన
Bhatti Vikramarka

Updated on: Feb 16, 2024 | 1:52 PM

ఎస్సీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అభయహస్తం కింద రూ.1,000 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయని, విధివిధానాలు రూపొందించిన తర్వాతే పథకాన్ని ముందుకు తీసుకువెళతామని చెప్పారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో భట్టి సమాధానమిస్తూ.. ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చినందున ఈ బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించిందన్నారు. కేటాయింపులు చేసినా గత ప్రభుత్వం రూ.17 వేల కోట్ల నిధులు విడుదల చేయడంలో విఫలమైందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఇందిరమ్మ గృహాలు, బడ్జెట్ కేటాయింపులపై భట్టి మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతల సూచనలను స్వాగతించిన డిప్యూటీ సీఎం, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని , ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. కమిషన్‌కు అవసరమైన సిబ్బందిని నియమించిన తర్వాత నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని చెప్పారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రూ.7,11,911 కోట్ల బడ్జెట్‌యేతర అప్పులు చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ప్రతిపక్షాలకు ఇచ్చిన సమాధానంలో, మొత్తం ఆరు హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని.. FRBM పరిమితుల ప్రకారం రుణం తీసుకోవాలన్నారు. అలాగే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చాలని చెప్పారు. రైతు భరోసాకు రూ.15,075 కోట్లు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి రూ.7,740 కోట్లు, గృహజ్యోతికి రూ.2,418 కోట్లు, మహాలక్ష్మి గ్యాస్‌కు రూ.723 కోట్లు సహా ఆరు హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.53,196 కోట్లు కేటాయించిందని భట్టి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..