తెలంగాణ వ్యాప్తంగా రేపట్నుంచి స్కూల్స్ పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ మినహా మిగతా అన్ని పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సర్కార్ అనుమతించింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్ధులను బలవంతం చేయొద్దని పేర్కొంది.
అలాగే పేరెంట్స్ తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ఇష్టపడకపోతే యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదని స్పష్టం చేసింది. అటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రైవేటు విద్యాసంస్థలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ క్లాసులు వారం రోజుల పాటు నిర్వహించుకోవచ్చునని తెలిపింది. కాగా, పాఠశాలలో ఉన్నప్పుడు ఏ విద్యార్ధి అయినా వైరస్ బారినపడితే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. ఒకవేళ అలా చేస్తే స్కూళ్ల అనుమతులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను తెరవట్లేదని విద్యాశాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా తెలిపారు. ఇవి మినహా మిగతా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.