Telangana Intermediate Exams: తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పరీక్షల నిర్వహణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొలుత ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను జూన్, జులో నిర్వహిస్తామని ప్రకటించినా.. పరిస్థితులు అందుకు అనుకూలించేలా లేవు. దీంతో ప్రభుత్వ పరీక్షల నిర్వహణపై తర్జన భర్జన పడుతోంది. ప్రభుత్వం నిర్ణయం సందిగ్ధంలో ఉండటంతో విద్యార్థులు సైతం అయోమయంలో పడ్డారు. వాస్తవానికి లాక్‌డౌన్ ముగియగానే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ, కరోనా వ్యాప్తి ఇంకా ఉండటంతో ఏం చేయాలా? అని ఆలోచనలో పడింది సర్కార్. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఆరా తీస్తోంది.
ఇదిలాఉంటే.. జులై రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష సమయాన్ని కుదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే, తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారడంతో సర్కార్ డైలమాలో ఉంది. పరీక్షలు రద్దు చేయాలా? నిర్వహించాలా? ఒకవేళ రద్దు చేస్తే ఏ ప్రాతిపదికన మార్కులు కేటాయించాలి? అనే అంశాలపై అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. అయితే, పరీక్షలు రద్దు చేస్తే ఫలితాలు ఎలా ప్రకటించాలనే దానిపై ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు తెలుస్తోంది. ప్రథమ సంవత్సరంలో మార్క్స్ ఆధారంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలు ప్రకటించాలని సూచించిన ఆధికారులు.. మరికొన్ని ప్రత్యామ్నాయాలు కూడా సూచించారు.
మరోవైపు సీబీఎస్‌ఈ క్లాస్ 12 పరీక్షల నిర్వహణపై కేంద్రం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. క్లాస్ 12 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు.. ఫలితాల ప్రకటనకు సంబంధించి విధి విధానాలు, ఏ ప్రాతిపదికన రిజల్ట్స్ వెల్లడించాలనే దానిపై కేంద్రం ఒక కటిమీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం క్లాస్ 12 ఫలితాలు వెల్లడించనుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
Also read:
Maharashtra To Unlock : అన్ లాక్ బాటలో మహారాష్ట్ర.. సోమవారం నుంచి లాక్ డౌన్ సడలింపులు