AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌ రెడ్డి నియమితులయ్యారు. 1994 బ్యాచ్‌కి చెందిన IPS ఆఫీసర్‌ శివధర్‌ రెడ్డి పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఇంటలిజెన్స్ ఛీఫ్ ఉన్న శివధర్‌.. అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన శివధర్ రెడ్డి.. కెరీర్‌లో గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు.

తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్
Dgp Shivdhar Reddy, Cm Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Sep 26, 2025 | 8:30 PM

Share

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌ రెడ్డి నియమితులయ్యారు. 1994 బ్యాచ్‌కి చెందిన IPS ఆఫీసర్‌ శివధర్‌ రెడ్డి పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ ఇంటలిజెన్స్ ఛీఫ్ ఉన్న శివధర్‌.. అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన శివధర్ రెడ్డి.. కెరీర్‌లో గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు. అంతేకాదు ఐక్యరాజ్యస సమితి శాంతిపరిరక్షణ వింగ్‌లోనూ పనిచేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలే కలాన్‌ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందిన వ్యక్తి శివధర్‌రెడ్డి. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ కూడా చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ASPగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలోనూ పనిచేశారు. గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్ గా‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగానూ పనిచేశారు. SPగా, DIG SIBగా మావోయిస్టుల అణిచివేతలో ఆయనది కీలకపాత్ర.

2014-2016 మధ్య తెలంగాణకి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా కూడా ఆయనే పనిచేశారు. 2016లో మోస్ట్ వాంటెడ్ నయీం ఎన్‌కౌంటర్ ఆపరేషన్ ప్లాన్ చేసింది కూడా శివధర్ రెడ్డే. ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో పనిచేశారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పులలో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపిగా శివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన వ్యక్తిగా శివధర్ రెడ్డికి మంచి పేరు ఉంది.

విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం Arrive Alive క్యాంపెయిన్ నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా పనిచేసిన శివధర్ రెడ్డి.. పర్సనల్ వింగ్ లో ఐజి, అడిషనల్ డీజీ పని చేశారు. అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గాను అనుభవం. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. 2024లో డీజీపీ ర్యాంక్‌కి ప్రమోట్ చేసింది. కెరీర్‌లో ఇప్పటికి గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు శివధర్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..