
Telangana Floods: ఉమ్మడి వరంగల్ జిల్లా వరద గుప్పిట్లో చిక్కుకుంది. ప్రధానంగా వరదలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న మోరంచపల్లి ప్రజలను అధికారులు కాపాడారు. రాత్రికి రాత్రి మోరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తడంతో.. అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. కాసేపటి క్రితం అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోరంచపల్లిలో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామస్తులను కాపాడేందుకు ఆర్మీ, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్మీ హెలికాప్టర్ల సహాయంతో గ్రామస్తులను అక్కడి నుంచి తరలించారు. ఆర్మీ హెలికాప్టర్లకు తోడు NDRF సిబ్బంది బోట్లను తీసుకుని వెళ్లారు.
భారీ వరదలకు మోరంచ వాగు ఉప్పొంగడంతో.. ఈ నీరు గ్రామాన్ని ముంచెత్తింది. ఏం జరుగుతుందో తెలసుకునే లోపే వరద నీరంతా ఊరును చుట్టేసింది. తమను తాము కాపాడుకునేందు ప్రజలు కొందరు దాబాలపై ఎక్కగా.. మరికొందరు చెట్లపైకి చేరారు. ప్రధాన రహదారిపై కూడా నీరు చేరడంతో.. ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఉండిపోయి కాపాడమంటూ వేడుకున్నాడు. చివరకు లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు.
మోరంచపల్లితో పాటు వరద పరిస్థితులపై సమీక్షించిన సీఎం కేసీఆర్.. ఎప్పటికప్పుడు అధికారులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో 1550 మంది జనాభా ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. నగరం, పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా వరద ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ ఊరిని తీసుకున్నా.. వరదమయం అయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..