Monkeys: తెలంగాణలో రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. భూమి ఉంది.. సాగు నీరు ఉంది.. కానీ వేసిన పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. కోతులు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. పంట పొలాలతో పాటు ఇళ్లపైకి దూసుకొస్తున్నాయి. మహిళలు, చిన్నారులపై కూడా దాడులు చేస్తున్నాయి. దీంతో ఇళ్లల్లో ఉండే మహిళలు, చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారు.
పాలేరు, వైరా, ఇల్లందు ప్రాంతాల్లో పంట పొలాలపై కోతుల గుంపులు దాడులు చేస్తున్నాయి. రైతులు విత్తనాలు వేసిన దగ్గరి నుంచే పంట చేతికొచ్చే వరకు కోతుల నుంచి పంటలను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పటికైనా కోతుల బారి నుంచి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. అటు కోతులు దాడులు చేయకుండా చూడాలని మహిళలు కూడా కోరుతున్నారు.