పోలవరం (Polavaram) డ్యాం నిర్మాణంపై ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరింది. పోలవరం నిర్మాణం పూర్తయితే వెనుక జలాలతో భద్రాచలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని లేఖలో వెల్లడించింది. ఈ అంశంపై గతంలోనే కేంద్ర జలశక్తి బోర్డు దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేసింది. గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా భద్రాచలం (Bhadrachalam) వద్ద 99 గ్రామాలు మునిగిపోయాయని పేర్కొంది. 26 లక్షల క్యూసెక్కుల బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఏటా భద్రాచలానికి ముంపు తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేయించాలని విజ్ఞప్తి చేసింది. కాగా.. ఈ నెల ప్రారంభంలో గోదావరికి భారీ వరదలు వచ్చాయి. భద్రాచలం వద్ద తీవ్ర రూపం దాల్చింది. కేవలం పై నుంచి వస్తున్న వరదలకే భద్రాద్రి ముంపునకు గురైతే.. పోలవరం పూర్తైతే రామాలయం పరిస్థితి ఏంటనే విషయంపై ఆందోళనలు మొదలయ్యాయి.
చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఒకానొక దశలో వరద 70 అడుగులు దాటింది. భద్రాచలం రామాలయం చెంతకు వరద నీరు చేరింది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. భద్రాచలం దగ్గర గోదారిలో 31 అడుగుల నీటిమట్టం దాటితే పర్ణశాల మునిగిపోతుంది. ఇప్పుడు పోలవరం పూర్తైతే ఎప్పుడూ భద్రాచలం వద్ద 43 అడుగుల నీటి మట్టం ఉంటుంది. అదే జరిగితే పర్ణశాల ప్రాంతం జలగర్భంలోకి వెళ్లిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన భద్రాద్రికి వరద గండం పొంచి ఉండటంతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..