Delhi: నూతన మద్యం విధానంపై వెనక్కు తగ్గిన ఆప్.. మరో ఆరు నెలలు పాత విధానమే
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం విధానాన్ని ఉపసంహరించుకున్నారు. మరో ఆరునెలల పాటు పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా....
దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం విధానాన్ని ఉపసంహరించుకున్నారు. మరో ఆరునెలల పాటు పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించే దుకాణాల ద్వారానే మద్యాన్ని విక్రయించాని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. 2021 నవంబర్ నుంచి నూతన మద్యం విధానం 2021-22 ను కేజ్రీవాల్ ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చింది. దీనిపై భారీగా విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ పరిణామాలతో ఢిల్లీ ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలుపై వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అనంతరం బీజేపీపై (BJP) మనీష్ సిసోడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అక్రమ మద్యం వ్యాపారాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే లిక్కర్ లైసెన్సులు తీసుకున్న వారిని ఈడీ, సీబీఐ సంస్థలతో బెదిరిస్తున్నారని, తద్వారా చాలా మంది దుకాణాలు మూసేస్తున్నారని ఆరోపించారు. వారి ప్రయత్నాలను ఉపేక్షేది లేదన్న సిసోడియా.. అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా ప్రభుత్వ దుకాణాల ద్వారానే మద్యం అమ్మకాలు చేస్తామని స్పష్టం చేశారు.
కాగా.. ఢిల్లీలో నూతన మద్యం విధానంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మద్యం సేవించేవారి వయసు 21ఏళ్లకు తగ్గించడం, షాపుల సంఖ్య పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మద్యం అమ్మకాలను పూర్తిగా ప్రైవేటుకే ఇవ్వడంతో మద్యం దుకాణాలు సూపర్ మార్కెట్లుగా మారతాయని మండిపడుతున్నారు. మరోవైపు.. నూతన మద్యం విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శి ఓ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐకి సూచించారు.
అయితే.. అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విధానానికి ముందు రూ. 6వేల కోట్లు ఆదాయం రాగా కొత్త విధానం తర్వాత ప్రభుత్వానికి రూ. 9 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని తెలిపారు. అందుకే ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని మండిపడ్డారు. గుజరాత్ లో మద్యం నిషేధం కారణంగా కల్తీ సరకు వినియోగిస్తూ అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని సిసోడియా బీజేపీపై నిప్పులు చెరిగారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..