ఎన్నికల వేళ సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్న రాజకీయ నేతలు
సోషల్ మీడియా.. ఇదో పెద్ద వేదిక. జనాలతో కమ్యూనికేట్ అవ్వాలన్నా.. మనుషులను తప్పుదారి పట్టించాలన్నా.. వెబ్ దునియాలో ఉన్న మెయిన్ ప్లాట్ ఫామ్ ఇది. మనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అరచేతిలోకి వచ్చిన అధ్బుత టెక్నాలజీ. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా, ఓటర్ నుంచి లీడర్ దాకా అందరూ అందిపుచ్చుకుంటున్న సాధనం.

సోషల్ మీడియా.. ఇదో పెద్ద వేదిక. జనాలతో కమ్యూనికేట్ అవ్వాలన్నా.. మనుషులను తప్పుదారి పట్టించాలన్నా.. వెబ్ దునియాలో ఉన్న మెయిన్ ప్లాట్ ఫామ్ ఇది. మనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అరచేతిలోకి వచ్చిన అధ్బుత టెక్నాలజీ. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా, ఓటర్ నుంచి లీడర్ దాకా అందరూ అందిపుచ్చుకుంటున్న సాధనం. ఈ నేపథ్యంలోనే మారుతున్న కాలనుగుణంగా రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియానే ప్రథమ ఆయుధంగా ఎంచుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో ఆయా పార్టీల నేతలు రోజుకు రెండు మూడు సభలతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల జోష్‌ను మరింత పెంచుతున్నారు. అయితే ఎన్నికల ప్రచార సభలకు డబ్బులు ఇస్తే వేల సంఖ్యలో జనం హాజరవ్వడం అనేది మామూలు విషయమే. కానీ సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లను పెంచుకోవాలంటే అప్పటిదాకా సోషల్ మీడియా వైపు కూడా చూడని నేతలు ఒక్క పోస్టుతో వేలు.. లక్షల మందిని ఫాలోవర్స్‌గా మలుచుకుంటున్నారు.
ప్రతిఒక్క పార్టీ నేత పర్సనల్‌గా సోషల్ మీడియాలో ఓ పేజీ ఓపెన్ చేసి ఫాలోవర్లు పెరిగే వరకు ఎదురుచూడడం లాంగ్ ప్రాసెస్. కానీ ఇవేం లేకుండా పైసా కొడితే వేలు.. లక్షల సంఖ్యల్లో ఫాలోవర్స్‌ను తెచ్చిపెట్టే.. సరికొత్త విధానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీన్నే అందిపుంచుకునేందుకు పొలిటికల్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలక్షన్ల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండే సోషల్ మీడియా పేజీలను కొందరు డబ్బులకు అమ్మేస్తున్నారు. ఒక్కో ఫాలోవర్‌కి మూడు నుంచి ఐదువేల వరకు ధర నిర్ణయిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన నగరల్లో వీటికి భలే డిమాండ్ ఉందని సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు చెప్తున్నారు
సోషల్ మీడియాలో పోస్టులు కంటెంట్ నచ్చితేనే ఎక్కువ మంది వారిని ఫాలో అవుతూ ఉంటారు. ఉదాహరణకు కొందరు ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్స్‌ల్లో ఒక పేజీను ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రజలకు చేరువయ్యే విధంగా పోస్టులను పెడుతుంటారు. అనంతరం అవి వైరల్ అయిన తర్వాత అడ్మిన్లు ఈ పేజీలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన వీడియోలు, వాళ్లని కామెంట్ చేస్తూ మీమ్స్ ఈ విధంగా నిత్యం ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటారు. ఇలా పెట్టినటువంటి పోస్ట్ లేదా వీడియో వైరల్ అయిందా! ఒక్క నెల రోజుల్లోనే లక్షల్లో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంటారు.
ఈ విధంగా ఫాలోవర్లు పెరిగిన తర్వాత అడ్మిన్‌ను తొలగిస్తారు. ఒక్క ఫాలోవర్ 3 నుంచి 5000 రూపాయలకు కొంటారు. ఎవరైనా ఈ డబ్బు చెల్లిస్తే ఖాతాను వారి పేర్ల మీద మార్చేస్తారు. ఈ విధంగా సోషల్ మీడియా స్ట్రాటజిస్టులకు భలే డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే వివిధ పార్టీల అభ్యర్థులు ఆశావహులు వీరిని తాత్కాలికంగా నియమించుకుంటున్నారు. వాళ్ళు చేసేటటువంటి పర్యటనలు ప్రసంగాలు నియోజకవర్గ స్థాయిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా పోస్టులు చేస్తున్నారు. ఈ విధంగా సామాజిక మాధ్యమాలలో ముందు వరుసలో చాలామంది అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
గతంలో రోడ్ల నిండా ఎక్కడ చూసినా ఆ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీల ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపించేవి. ఆ తర్వాత సభలలో ప్రసంగించడం ఉత్తేజపరిచేలా మాట్లాడడం, హామీలు ఇవ్వడం జరిగేవి. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఈ విధంగా ఎన్నికల్లో విపరీతంగా వాడుతున్నారు రాజకీయ నేతలు. నేరుగా సామాన్యులకు చేరువుతూ తమ వైపు మరల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క పోస్ట్‌తో జనంలోకి వెళ్తున్నారు నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
