Telangana election: పాతబస్తీలో జోరుగా ఎన్నికల ప్రచారం.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా అసద్, అక్బరుద్దీన్ సన్స్
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతలు వరుస సభలు, సమావేశాలతో దూకుడు పెంచారు. కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో మేము సైతం అంటున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్‌తో పాటు అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ తండ్రులతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు.

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతలు వరుస సభలు, సమావేశాలతో దూకుడు పెంచారు. కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో మేము సైతం అంటున్నారు. ఎంఐఎం నేతలు ప్రచారంలో ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి. ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిత్యం జనాల్లోనే ఉంటారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకుంటారు. చిన్న చిన్న శుభకార్యాలకు కూడా వెళ్లి ఇంట్లోని కుటుంబ సభ్యుల్లా కలిసిపోతుంటారు. ఇక ఆ పార్టీ అగ్రనేతలు వస్తున్నారంటే కార్యకర్తల్లో జోష్ మామూలుగా ఉండదు.
ఇక తెలంగాణ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అయితే రెండు స్థానాల్లో సిట్టింగ్‌లను పక్కనపెట్టి కొత్త వారికి అవకాశం కల్పించింది. అంతే కాకుండా నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ అభ్యర్థిని యాకుత్‌పురాకు మార్చారు. ఆ స్థానంలో కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అలాగే బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులపై సందిగ్ధత నెలకొంది. ఇంత వరకు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థి ఎవరా అన్న దానిపై స్థానికులతో పాటు ఎంఐఎం వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరిని మారుస్తారు, లేక పాత అభ్యర్థులనే బరిలోకి దించుతారా అన్న సంద్ధిగత నెలకొంది.
మిగతా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన చోట ఎంఐఎం అగ్రనేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. రాత్రి సమయాల్లో మీటింగ్‌లతో దూసుకుపోతున్నారు. అయితే కేవలం అగ్రనేతలే కాకుండా ఇప్పుడు వారి కుమారులు సైతం రంగంలోకి దిగారు. దీంతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్‌తో పాటు అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ తండ్రులతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. పాదయాత్రలు చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. జనాలు సైతం పెద్ద నేతలను పట్టించుకోకుండా వారి కుమారులను కలిసేందుకే మొగ్గు చూపుతున్నారు. వారితో కరచాలనం చేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది వరకు ఎప్పుడూ ప్రచారంలో కనిపించని అసద్, అక్బరుద్దీన్ కుమారులు ఒక్కసారిగా జనాల్లోకి వచ్చేసరికి ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఉత్సాహంగా వారి వెంట అడుగులు వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
