మెదక్, సెప్టెంబర్ 25: వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలు.. ఏ గల్లి చూసినా మండపాలే ఏ వీధి చూసిన భక్తి పరవశమే కనిపిస్తుంది. కానీ ఓ వినాయక మండపంలో యువత డిఫరెంట్ గా ఆలోచన చేశారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో మండపానికి ఓటును నోటుకు అమ్ముకోకూడదు అంటూ, ఓటు ఒక ఆయుధం లాంటిది అంటూ ఓటర్లకు సూచనలు చేస్తూ వినాయక మండపాన్ని అలంకరించారు ఇదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎన్నికలు వస్తున్నాయని సమయాన్ని గుర్తు చేస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలో దుబ్బాక పోలీస్ స్టేషన్ సమీపంలోనీ 1999 నుండి ప్రతి ఏటా యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేన్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ ఏటా కూడా మండపాన్ని ఏర్పాటు చేసి బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తూనే ఒక వినూత్న రీతిలో యువత తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో..ఎలా నమోదు చేసుకోవాలో అనే విషయాల పై కొన్ని కొటేషన్లు రూపంలో మండపంలో ఉంచారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటుకు నోటు తీసుకోవద్దని, ఒకసారి ఓటుకు నోటు తీసుకుంటే ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఓటును ఒక ఆయుధంగా మలుచుకుని రాష్ట్ర అభివృద్ధికి పనిచేసే నాయకుని ఎంచుకుని తమ ఓటును వినియోగించు కోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రకంగా యువత ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో వినూత్నంగా ఇలా ప్రచారం చేస్తున్నామని అంటున్నారు.
అందుకే ప్రతి ఒక్కరూ మేల్కొని తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని, కొటేషన్ల ద్వారా ప్రజల ముందు ఉంచామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెబుతున్నారు..నిజంగా ఈ బొజ్జ గణపయ్య మండపం ద్వారా ప్రజలు మారుతారా లేక ఓటుకు నోటు తీసుకుని ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడతారా అనేది చూడాలి మరి. బొజ్జ గణపయ్య ఓటర్ల మనసు మార్చి నిజాయితీపరులైన నాయకునికి ఓటు వేసి గెలిపించేలా చూస్తారా అనేది వేచి చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.