తెలంగాణ రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు ప్రజారోగ్య సంచాలకులు(DH) శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేసినట్లు ధర్మాసనానికి వివరించారు. కోవిడ్ ఔషధాలకు సంబంధించిన బ్లాక్ మార్కెట్‌పై 160 కేసులు, మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు నమోదు చేశామన్నారు. దీనికి సంబంధించి రూ.37.94 కోట్ల జరిమానా, భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు, లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 3.43 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ కోర్టుకు తెలిపారు.
గత నెల 29వ తేదీ నుంచి రోజుకు సరాసరి లక్ష కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు డీహెచ్ వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,79,098 వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారని.. ప్రభుత్వాసుపత్రుల్లో 36.50 శాతం, ప్రైవేటు ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండినట్లు ఆయన తెలిపారు.
కరోనా మూడో దశ వస్తే ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డీహెచ్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 10,366 బెడ్లను ఆక్సిజన్ పడకలుగా మార్చినట్లు చెప్పారు. మరో 15వేల పడకలకు కూడా ఆక్సిజన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 132 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పిల్లల కోసం నాలుగు వేల పడకల ఏర్పాట్లతో పాటు నిలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన నివేదికలో పేర్కొన్నారు. వైద్య సిబ్బంది పెంపునకు, శిక్షణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.