AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court: తెలంగాణ హైకోర్టులో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా? నెంబర్ వింటే..

తెలంగాణ హైకోర్టులో కేసుల పెండెన్సీ భారీగా పెరిగిపోతోంది. న్యాయమూర్తుల కొరతకు తోడు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో న్యాయవ్యవస్థపై భారం ఎక్కువవుతుంది. 2025 జూన్‌ 30 నాటికి తెలంగాణ హైకోర్టులో 2.29 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

High Court: తెలంగాణ హైకోర్టులో ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో తెలుసా? నెంబర్ వింటే..
Cases Pending In Telangana High Court
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 4:46 PM

Share

తెలంగాణ హైకోర్టులో రోజురోజుకూ పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే పోతుంది. 2025 నాటికి హైకోర్టులో 2.29 పెండింగ్‌ కేసులు ఉన్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యంగా 1,36,396 రిట్‌ పిటిషన్లు, 21,247 సివిల్‌ అప్పీళ్లు, 14,511 మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. క్రిమినల్‌ అప్పీళ్లు కూడా వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 31,995 కేసులు పదేళ్లకు పైగా పరిష్కారం కాకుండా కొనసాగుతున్నట్లు వెల్లడైంది. న్యాయమూర్తుల కొరత కూడా పెండెన్సీకి ప్రధాన కారణంగా మారింది. హైకోర్టులో 42 మంది న్యాయమూర్తుల మంజూరైన పోస్టులకు ప్రస్తుతం 26 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. న్యాయమూర్తుల సంఖ్యకు అనుగుణంగా కేసుల భారం తగ్గకపోవడంతో విచారణలు, తీర్పులు ఆలస్యమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

జిల్లా కోర్టులో పెండింగ్ కేసులు

తెలంగాణలోని జిల్లా కోర్టుల్లోనూ పరిస్థితి మరింత భారంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. హైకోర్టు పరిధిలోని జిల్లా కోర్టుల్లో సుమారు 9.38 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం పెండెన్సీలో దాదాపు 1.48 లక్షల కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. అందుకే న్యాయవ్యవస్థను ఆధునికీకరించేందుకు తెలంగాణ హైకోర్టు పలు సాంకేతిక చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 99 ఈ-సేవా కేంద్రాల ద్వారా న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నివేదిక తెలిపింది.

వీటిలో 31 కేంద్రాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌ సెటిల్‌మెంట్లు, మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌లకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌, జ్యుడీషియల్‌ ప్రిజర్వేషన్‌ వ్యవస్థతో పాటు AI ఆధారిత లీగల్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌ వంటి సాంకేతిక కార్యక్రమాలను కూడా అమలు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

దేశంలో వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులు

దేశంలోని ఇతర హైకోర్టులతో పోల్చినా పెండింగ్‌ కేసుల సమస్య తీవ్రంగానే ఉంది. అలహాబాద్‌ హైకోర్టులో 11.66 లక్షలు, రాజస్థాన్‌ హైకోర్టులో 6.29 లక్షలు, బాంబే హైకోర్టులో 4.60 లక్షలు, ఢిల్లీ హైకోర్టులో 4.21 లక్షలు, మద్రాస్‌ హైకోర్టులో 2.54 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ.. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.. సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించడం ద్వారా కేసుల పెండెన్సీని తగ్గించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us