MLA Jaggareddy: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. జల వివాదాలతో కేసీఆర్, జగన్ లు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. జల వివాదంపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. చిన్న ఇష్యూను పెద్దగా చేస్తున్నారని విమర్శించారు. ఇదిలాఉంటే.. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలకు అనుమతి లేదని జీఈఓ చెప్పడంపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అందరి వాడు అని, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతి లేదని జీఈఓ చెప్పడం సరికాదన్నారు. దేవుడి దర్శనంలోనూ రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా? అని ప్రశ్నించారు. ఇది దుర్మార్గమైన చర్య అని నిప్పులు చెరిగారు.
ఇదే సమయంలో వైఎస్ షర్మిల పార్టీపైనా జగ్గారెడ్డి స్పందించారు. జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ అంటూ కొత్త డ్రామాకు తెర లేపారని విమర్శలు గుప్పించారు. షర్మిల తెలంగాణ కోడలే అయినా.. ఆమె రాయలసీమ రక్తమే కదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ‘అన్న ఆడ.. చెల్లెలు ఈడ.. ఏంటి ఈ నాటకాలు’ అంటూ నిప్పులు చెరిగారు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ లోటస్ పాండ్‌లో అంతా కలిసే ఉంటారని, బయటకు మాత్రం తమ మధ్య విభేదాలు ఉన్నట్లు నటిస్తున్నారని దుయ్యబట్టారు. షర్మిల పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రోత్బలంతోనే వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే జగన్ ఏ అంశంలోనూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. షర్మిల పార్టీకి తెలంగాణలో మనుడ లేదన్నారు. వారి ఆటలు ఇక్కడ సాగబోవని వ్యాఖ్యానించారు.
Also read:
TS News: రాత్రుళ్లు వింత శబ్దాలు.. జనాలు హడల్.. మగవాళ్లను బలితీసుకుంటున్న వింత ఆకారం!
బెంగుళూరు సెంట్రల్ జైలు, రౌడీ షీటర్ల ఇళ్లపై పోలీసుల ఆకస్మిక దాడులు.. కత్తులు, డ్రగ్స్ స్వాధీనం
Beggar Donations: భిక్షాటన సొమ్ము కరోనా నివారణ, విద్యార్థుల చదువులకు సాయం.. దానశీలిగా మారిన వృద్దుడు