Telangana: మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లేనా..?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకుగానూ పార్టీ నుంచి 6ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నా రెడ్డి లేఖ విడుల చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో..

Telangana: మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ షాక్.. బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లేనా..?
Marri Shashidhar Reddy

Updated on: Nov 19, 2022 | 5:58 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకుగానూ పార్టీ నుంచి 6ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నా రెడ్డి లేఖ విడుల చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగానూ, కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షులుగా మర్రి శశిధర్ రెడ్డి పనిచేశారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ నేతలతో కలిసి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను శశిధర్ రెడ్డి కలిశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శశిధర్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. అమిత్ షాను కలవడంతో పాటు.. బీజేపీలో చేరాలని కోరారన్న వార్తలు రావడం, మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం విడుదల చేసిన లేఖలో పేర్కొంది.

తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. పార్టీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయనతో చెప్పినట్లు తెలిసింది. సహచరులతో చర్చించి మరో వారం రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మరో వైపు మర్రి శశిధర్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆల్వేస్ కాంగ్రెస్ మ్యాన్ అనే పదాన్ని తొలగించారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. మర్రి శశిథర్ రెడ్డి కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరూ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని శశిధర్ రెడ్డి తప్పుబట్టారు. ఒక దశలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందినట్లు స్వయంగా వెల్లడించారు.

గతకొద్ది రోజులుగా కూడా మర్రి శశిధర్ రెడ్డి వ్యవహరాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ వస్తోంది. అమిత్ షాను కలివడంతో ఇక శశిధర్ రెడ్డి పార్టీ మారడం ఖాయమనే నిర్ణయానికి హస్తం పార్టీ అధిష్టానం వచ్చినట్లు సమాచారం. గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ను కలిశారు. ఆ తర్వాతే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ త్వరగా మేల్కొని క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..